జగన్నాథ రథయాత్రపై స్టే ఉపసంహరణ పిటిషన్లపై విచారణ సోమవారం

ABN , First Publish Date - 2020-06-22T03:38:27+05:30 IST

పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన

జగన్నాథ రథయాత్రపై స్టే ఉపసంహరణ పిటిషన్లపై విచారణ సోమవారం

న్యూఢిల్లీ : పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరవుతారన్న సంగతి తెలిసిందే. 


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఒడిశాలోని పూరీలో ఈ నెల 23న జరగవలసిన జగన్నాథుని రథయాత్రను అనుమతిస్తే, జగన్నాథుడు మనల్ని క్షమించడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రథయాత్రను అనుమతించలేమని తెలిపింది. రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఆదేశాలు జారీ చేసింది.


ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, సవరించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లలో జగన్నాథ్ సంస్కృతి జన జాగరణ మంచ్ కూడా ఉంది. రథయాత్రను అనుమతించాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ సింగిల్ జడ్జి బెంచ్ సోమవారం విచారణ జరుపుతుంది. 


ఇదిలావుండగా, పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆదివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏటా జరిగే జగన్నాథ రథయాత్రను నిలిపేసేందుకు అత్యంత సమన్వయంతో కూడిన ప్రణాళిక అమలవుతోందన్నారు. ఈ నెల 18న ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సవరించాలని కోరుతూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ఈ నెల 20న సుప్రీంకోర్టు స్వీకరించి ఉండవలసిందన్నారు. సెలవుల్లో సైతం ముఖ్యమైన కేసులను సుప్రీంకోర్టు చేపట్టిన దృష్టాంతాలు ఉన్నాయన్నారు. 


మరోవైపు, గజపతి మహారాజా దిబ్యసింఘ దేబ్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఓ లేఖ రాశారు. ఈ నెల 23న నిర్వహించవలసిన జగన్నాథ రథయాత్రను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించే విధంగా జోక్యం చేసుకోవాలని కోరారు. భక్తులు హాజరు కాకుండా రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాలని ఈ లేఖలో కోరారు. 


Updated Date - 2020-06-22T03:38:27+05:30 IST