నిరసన కార్యక్రమాల్లో బాలలు పాల్గొనడంపై సుప్రీంకోర్టు విచారణ
ABN , First Publish Date - 2020-02-08T02:45:22+05:30 IST
ఆందోళనలు, నిరసన ప్రదర్శనల్లో బాలలు పాల్గొనడాన్ని నిరోధించడంపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని

ఆందోళనలు, నిరసన ప్రదర్శనల్లో బాలలు పాల్గొనడాన్ని నిరోధించడంపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 10న దీనిపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్ వెల్లడించింది. ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో జనవరి 30న ఓ చిన్నారి మరణించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.
జాతీయ సాహస బాలల పురస్కారం పొందిన, ముంబైకి చెందిన 12 ఏళ్ళ చిన్నారి జెన్ గుణరతన్ సదావర్తి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. చిన్నారులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనకుండా నిరోధించాలని, చిన్నారులు నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనడం క్రూరత్వమవుతుందని పేర్కొన్నారు. షహీన్ బాగ్‌లో మరణించిన బాలుడి హక్కులను కాపాడటంలో ఆ బాలుని తల్లిదండ్రులు, నిరసన కార్యక్రమం నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపించారు. బాలలు తట్టుకోలేని పరిస్థితుల్లో వారిని ఉంచడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 30 రాత్రి ఓ నాలుగు నెలల పసికందు నిద్రలోనే మరణించాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని, ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సదావర్తి ముంబైలోని పరేల్‌లో క్రిస్టల్ టవర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం నుంచి 17 మందిని కాపాడాడు. ఆ బాలుని ధైర్య, సాహసాలను, సమయస్ఫూర్తిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ బాలునికి జాతీయ సాహస బాలల పురస్కారం ప్రకటించింది.