కోవిడ్-19 నెగెటివ్ వస్తేనే ఒడిశాకు రావాలన్న ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-05-09T01:14:32+05:30 IST

కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినవారిని మాత్రమే ఒడిశాలో ప్రవేశించేందుకు

కోవిడ్-19 నెగెటివ్ వస్తేనే ఒడిశాకు రావాలన్న ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ : కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినవారిని మాత్రమే ఒడిశాలో ప్రవేశించేందుకు అనుమతించాలన్న ఒరిసా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. ఒరిసా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వలస కూలీలు తిరిగి స్వరాష్ట్రానికి రావాలనుకుంటే, ముందుగా వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని, ఆ పరీక్షల్లో నెగెటివ్ అని నిర్థరణ అయినవారు మాత్రమే ఒడిశాలో ప్రవేశించేందుకు వాహనం ఎక్కేవిధంగా జాగ్రత్త వహించాలని హైకోర్టు ఆదేశించింది. 


హైకోర్టు ఆదేశాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీనిని పరిశీలించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలపై శుక్రవారం నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. 


కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, దాదాపు 40 రోజుల నుంచి దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు, వలస కూలీలు తమ స్వరాష్ట్రమైన ఒడిశాకు వెళ్ళేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు. 


కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం కోసం అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ప్రజలు, విద్యార్థులు, వలస కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 


తమ రాష్ట్రంలోకి ప్రవేశించేవారిని తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే, అందుకు తగిన ఏర్పాట్లు చేయవచ్చునని, అయితే ప్రజల ప్రవేశాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించజాలవని చెప్పారు. ఇటువంటి ఆదేశాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని తెలిపారు. Updated Date - 2020-05-09T01:14:32+05:30 IST