యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2020-03-12T18:07:45+05:30 IST

హింసాకాండలో నిందితుల ఫొటోలతో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ చర్యను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన ...

యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

లక్నో : హింసాకాండలో నిందితుల ఫొటోలతో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ చర్యను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో జరిగిన హింసాకాండ నిందితుల ఫొటోలతో ఈ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


ఇటువంటి హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని జస్టిస్ యూయూ లలిత్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా మించి ఏదైనా చేయవచ్చునా? అని నిలదీసినట్లు సమాచారం. 


సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా జరిగిన విధ్వంసకాండ నిండితులతో కూడిన హోర్డింగ్‌లను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీలు చేసింది. ఈ అపీలుపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఉత్తర ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్ వాదనలు వినిపించారు.


ఈ పోస్టర్లను లక్నోలో పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీసుల చర్య సమర్థనీయం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల చర్య ప్రజల వ్యక్తిగత గోప్యతలో సమర్థనీయం కాని రీతిలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.


Updated Date - 2020-03-12T18:07:45+05:30 IST