ఆ బాలలకు నెలకు రూ.2 వేలు ఇవ్వండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-12-15T20:20:26+05:30 IST

చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ (సీసీఐ)లో ఆశ్రయం పొంది, కోవిడ్-19 మహమ్మా

ఆ బాలలకు నెలకు రూ.2 వేలు ఇవ్వండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ (సీసీఐ)లో ఆశ్రయం పొంది, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తమ కుటుంబాల వద్దకు వెళ్ళిన బాలల విద్య కోసం నెలకు రూ.2,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీసీఐలలో ఆశ్రయం పొందిన బాలలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు పుస్తకాలు, స్టేషనరీ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను సీసీఐలకు సమకూర్చాలని తెలిపింది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల సిఫారసుల ఆధారంగా ఈ సదుపాయాలను 30 రోజుల్లోగా సమకూర్చాలని తెలిపింది. సీసీఐలలోని బాలలకు విద్యను బోధించేందుకు అవసరమైన టీచర్లను నియమించాలని తెలిపింది. 


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో చైల్డ్ కేర్ సెంటర్లలోని బాలల పరిస్థితులపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరిపింది. అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ అమికస్ క్యూరీగా వ్యవహరించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగీ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సీసీఐలలో 2.27 లక్షల మంది ఉన్నారని, వీరిలో 1.45 లక్షల మంది తమ కుటుంబాలు, సంరక్షకుల వద్దకు చేరుకున్నారని ధర్మాసనానికి అమికస్ క్యూరీ చెప్పారు. 


Updated Date - 2020-12-15T20:20:26+05:30 IST