వ్యవసాయ చట్టాల అమలును ఆపండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-12-17T19:52:21+05:30 IST

వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును

వ్యవసాయ చట్టాల అమలును ఆపండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపి ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం, నిరసనలపై దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు. 


కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ, వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపేయడానికి అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం స్పందిస్తూ, అది జరిగే అవకాశం లేదని పేర్కొంది. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ, ముందుగానే కాదనవద్దని, దయచేసి సలహాను పరిశీలించాలని చెప్పారు. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. తదుపరి విచారణ వింటర్ వెకేషన్‌లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్‌ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు అవకాశం కల్పించారు. 


ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వారాల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులను రహదారులపై నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.


Updated Date - 2020-12-17T19:52:21+05:30 IST