వడ్డీ రద్దు పథకాన్ని త్వరగా అమలు చేయండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-10-15T00:23:41+05:30 IST

రుణ గ్రహీతలు చెల్లించవలసిన వడ్డీపై వడ్డీ రద్దు పథకాన్ని త్వరగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా

వడ్డీ రద్దు పథకాన్ని త్వరగా అమలు చేయండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : రుణ గ్రహీతలు చెల్లించవలసిన వడ్డీపై వడ్డీ రద్దు పథకాన్ని త్వరగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా సామాన్యులు బాధపడుతున్నారని, రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్నవారి గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ నవంబరు 2న జరుగుతుందని, అప్పటికి సరైన చర్యలు తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించిన మారటోరియం సమయంలో వడ్డీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. రుణ గ్రహీతలకు సహాయపడే విధంగా రుణాలపై వడ్డీ రద్దు పథకాన్ని అమలు చేయడానికి కొన్ని లాంఛనాలను పూర్తి చేయవలసి ఉందని, తమకు కాస్త సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. 


దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, వడ్డీని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు, దానిని అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటోందని ప్రశ్నించింది. నవంబరు 15 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోందని, ఓ సరళమైన రద్దు పథకాన్ని అమలు చేయడానికి పూర్తిగా ఓ నెల ఎందుకని ప్రశ్నించింది. వడ్డీపై వడ్డీ నుంచి చిన్న తరహా రుణ గ్రహీతలకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉంటే, దానిని వారి ఖాతాల నుంచి ఉపసంహరించకూడదని (డెబిట్ చేయకూడదని) చెప్పింది. 


వడ్డీపై వడ్డీని రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్తూ, క్షేత్ర స్థాయిలో కచ్చితమైన ఫలితాలు రావలసిన అవసరం ఉందని తెలిపింది. బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలేవీ జారీ చేయలేదని, ఆర్బీఐ కూడా ఎటువంటి సర్క్యులర్‌నూ జారీ చేయలేదని పేర్కొంది. ప్రభుత్వం కేవలం అఫిడవిట్‌లో మాత్రమే పేర్కొందని, దానిని అమలు చేయలేదని పేర్కొంది. 


మార్చి నుంచి ఆగస్టు వరకు మారటోరియం

కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన ఇబ్బందికర పరిస్థితుల నుంచి రుణ గ్రహీతలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కొన్ని చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రుణాల తిరిగి చెల్లింపుపై మూడు నెలలపాటు మారటోరియం విధిస్తూ ఆర్బీఐ మార్చిలో ప్రకటన జారీ చేసింది. అనంతరం ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ ఆరు నెలల కాలంలో చెల్లించవలసిన వడ్డీపై వడ్డీని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్నవారికి వడ్డీపై వడ్డీని ఆరు నెలలపాటు రద్దు చేస్తామని తెలిపింది. 


Updated Date - 2020-10-15T00:23:41+05:30 IST