అర్నబ్‌పై చర్య తీసుకోవద్దు: సుప్రీం

ABN , First Publish Date - 2020-04-25T07:24:46+05:30 IST

రిపబ్లిక్‌ టీవీ చానల్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామిపై మూడు వారాల దాకా ఎలాంటి చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాల్‌ఘర్‌లో ఇటీవల ఇద్దరు

అర్నబ్‌పై చర్య తీసుకోవద్దు: సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రిపబ్లిక్‌ టీవీ చానల్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామిపై మూడు వారాల దాకా ఎలాంటి చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాల్‌ఘర్‌లో ఇటీవల ఇద్దరు సాధువుల మూకహత్యపై రిపబ్లిక్‌ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు అప్రతిష్ఠ కలిగించేలా గోస్వామి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గోస్వామిపై కేసులు దాఖలయ్యాయి. తనను ఆరెస్టు చేయరాదని కోరుతూ అర్ణబ్‌ గోస్వామి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఇదిలా ఉండగా గోస్వామిపైనా, ఆయన చానల్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ఆదేశాలివ్వాలని కోరుతూ బాంబే హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలయ్యింది. 


ఆగమేఘాల విచారణపై అభ్యంతరం!

జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగమేఘాలపై విచారణ చేపట్టడానికి ప్రాతిపదిక ఏమిటన్న విషయమై న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం అర్జంటు కేసులనే విచారించాలని గతంలో సుప్రీంకోర్టు నిర్ణయించడం తెలిసిందే. గురువారం రాత్రి గోస్వామి పిటిషన్‌ దాఖలు చేయగా, శుక్రవారం ఉదయమే దాన్ని అత్యవసర వ్యాజ్యాల జాబితాలో చేర్చడం సరైంది కాదంటూ సుప్రీంకోర్టు న్యాయవాది రీపక్‌ కన్సాల్‌ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అర్హమైన కేసులకు తక్షణ ప్రాధాన్యం కల్పిస్తూ జాబితాలో చేర్చడంపై వివక్ష పాటిస్తోందని ఆయన ఆరోపించారు.   

Updated Date - 2020-04-25T07:24:46+05:30 IST