రజనీకాంత్ పార్టీని ప్రారంభించక ముందే..
ABN , First Publish Date - 2020-12-06T16:41:21+05:30 IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీని ప్రారంభించక ముందే

చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీని ప్రారంభించక ముందే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెలాఖరులోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని మండ్రం నేతలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి జోన్‌కు కనీసం ముప్పై మందికి తగ్గకుండా బూత్‌కమిటీ సభ్యులను నియమించాలని మండ్రం జిల్లా నేతలకు ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పోయెస్‌గార్డెన్‌లో తన నివాసంలో పార్టీ సమన్వయకర్త తమిళురివి మణియన్‌తో ఆయన రెండు గంటలపాటు ఎన్నికల ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ఈ సమావేశానంతరం తమిళురివి మణియన్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ పేరును డిసెంబర్ 31న రజనీ ప్రకటిస్తారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న విషయమై జనవరిలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రజనీ ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మిక రాజకీయం పై ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రజనీ చెబుతున్న ఆధ్యాత్మిక రాజకీయం ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, అన్ని మతాలను సమానంగా పరిగణించే రాజకీయ విధానమని సుదీర్ఘ వివరణ ఇచ్చారు.