రజనీకి అసలు సీన్ అర్ధమయిందా?

ABN , First Publish Date - 2020-12-30T01:58:03+05:30 IST

రజనీకాంత్ పార్టీ పెడతానన్న ప్రకటన ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచింది. అటు.. తమిళ రాజకీయాల్లో కాక పుట్టించింది. అయితే, పార్టీ గురించి చేసిన పొలిటికల్‌ సర్వేలే రజనీకాంత్‌ తాజా నిర్ణయానికి..

రజనీకి అసలు సీన్ అర్ధమయిందా?

రజనీకాంత్ పార్టీ పెడతానన్న ప్రకటన ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచింది. అటు.. తమిళ రాజకీయాల్లో కాక పుట్టించింది. అయితే, పార్టీ గురించి చేసిన పొలిటికల్‌ సర్వేలే రజనీకాంత్‌ తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. రాజకీయంగా రజనీ అంతగా ప్రభావం చూపించలేరని సర్వే రిపోర్టులు తేల్చాయి. పార్టీ పెట్టినా 15 నుంచి 20 స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపించే అవకాశం ఉందని స్పష్టమయ్యింది. దీంతో.. అనారోగ్యం సాకుతో రజనీ పార్టీ ప్రకటనను విరమించుకున్నారని చర్చ జరుగుతోంది.  


రజనీకాంత్‌ రాజకీయ పార్టీ నిర్ణయం చాలా కాలంగా ఉన్నప్పటికీ.. జయలలిత మరణం తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఏర్పాటు గురించి రజనీ మాట్లాడటం, పార్టీ పెట్టే తేదీని కూడా ప్రకటించడంతో ఈసారి వెనక్కి తగ్గే అవకాశం ఉండదనుకున్నారు. జయలలిత చనిపోయినప్పటినుంచి తరచూ అభిమాన సంఘాల నాయకులతో భేటీలు నిర్వహించారు. పార్టీకి అవసరమైన కార్యాలయం గురించి కూడా చర్చించారు.



ఇందులో భాగంగానే ఈ ఏడాది తొలినాళ్ల నుంచి పార్టీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు ర‌జ‌నీకాంత్‌. గత మార్చిలో మీడియాతో మాట్లాడుతూ.. త‌న పార్టీ బంతిని ప్రజ‌ల కోర్టులోకి నెట్టాడు. ప్రజ‌లు ఓ తిరుగుబాటు చూపించాల‌ని కోరారు. 1967లో కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి డీఎంకే ఎలా అయితే అధికారంలోకి వ‌చ్చిందో అలాంటి తిరుగుబాటు కావాల‌ని ఆకాంక్షించారు. 


మరోవైపు.. త‌న స‌హ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ పార్టీ పెట్టేసి ప్రచారంలోకి కూడా దిగిన స‌మ‌యంలో.. తాను ఆకాంక్షించినట్లు ప్రజల్లో ఎలాంటి తిరుగుబాటు కనిపించని కాలంలో పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్. డిసెంబ‌ర్ 31న పార్టీ ప్రక‌ట‌న చేస్తానని, తాను ఆధ్యాత్మిక రాజ‌కీయాలు చేస్తాన‌నీ చెప్పారు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా అవినీత ర‌హిత రాజ‌కీయాలు చేస్తాన‌నీ చెప్పుకొచ్చారు. అదే సమయంలో రజనీ రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ అయిపోయిందని, ఆటో గుర్తు కేటాయించారని వార్తలు షికార్లు చేశాయి. దీంతో, రజనీకాంత్‌ పార్టీ పెట్టడం ఖాయమని, వచ్చే మేలో ఎన్నికల్లో పోటీ చేయడం ఖరారైపోయిందని విశ్లేషణలు వెలువడ్డాయి.


అటు.. రాజకీయంగా కూడా తమిళనాట వేడి మొదలయ్యింది. రజనీ వ‌స్తే త‌మిళ‌నాడులో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎలా మార‌తాయి.. ర‌జనీ ఎవ‌రితో అయినా చేతులు క‌లుపుతారా? ఒంటరిగా పోటీ చేస్తారా? అస‌లు ఆయ‌న ప్రభావం ఎలా ఉండ‌బోతోంద‌న్న విశ్లేష‌ణ‌లూ జ‌రిగాయి. ఇంతా చేసి చివ‌రికి దేవుడు హెచ్చరించాడంటూ అభిమానుల‌ను ఉసూరుమనిపించారు రజనీ కాంత్‌.


రజనీ తాజా ప్రకటన కూడా అస్పష్టంగానే ఉందంటున్నారు విశ్లేషకులు. తాను భవిష్యత్తులో పార్టీ పెట్టబోనని ఎక్కడా చెప్పలేదు. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రజనీ పార్టీ ఉండదు అని స్పష్టమయ్యింది. తమిళ రాజకీయాల్లో ఇదో సెన్సేషనల్‌గా మారింది. మరో కొత్త పార్టీ రాబోతోందని చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రజనీకాంత్‌ వెనక్కి తగ్గడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. 


రజనీకాంత్‌ ఆసుపత్రిలో ఉన్న సమయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ కలిశారు. రజనీ రాజకీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో సలహాలు, సూచనలు తీసుకొని ఉండొచ్చని అప్పుడే చర్చ జరిగింది. కానీ, ఇప్పుడు పార్టీ యోచన వాయిదా పడ్డాక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రకటన వెనుక ఏదో గట్టి ప్రోద్భలం ఉండి ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. రజనీ కాంత్‌ పార్టీ యోచన వెనుక భారతీయ జనతా పార్టీ ఉండొచ్చని ఇన్నాళ్లుగా అనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు పార్టీ పెట్టడం లేదని తెలిశాక రజనీకాంత్‌ ఎవరికి మద్దతు ఇస్తారన్నది హాట్‌ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఆయన అభిమానులు, సన్నిహితులు రజనీ పార్టీకోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టడం లేదని తెలిశాక ఆయన బహిరంగంగా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన, అభిమానులకు నిర్దేశించాల్సిన పరిస్థితి నెలకొంది.


తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఇప్పటికే చాలాసార్లు పార్టీ ప్రకటన వాయిదా పడింది. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఆయనకు 75 యేళ్లు నిండుతాయి. ఇప్పుడే అనారోగ్యం పేరుతో వెనక్కి తగ్గారు. అప్పటికి మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. అంటే.. ఆ వయసులో కొత్త పార్టీ పెట్టడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అధికారంలోకి రావడం సాధ్యమవుతాయా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా అంచనా వేస్తున్నారు.


- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-12-30T01:58:03+05:30 IST