తమిళనాడులో తెలుగోడి సత్తా చాటిన సూపర్ కలెక్టర్

ABN , First Publish Date - 2020-12-29T01:01:10+05:30 IST

ఆలోచన ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక ఉండాలి. సాధించాలనే కసి ఉప్పొంగాలి.. అప్పుడే ప్రకృతి విసిరే సవాళ్లను సైతం అధిగమించవచ్చు. కరోనా కట్టడిలో అయినా, ..

తమిళనాడులో తెలుగోడి సత్తా చాటిన సూపర్ కలెక్టర్

ఆలోచన ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక ఉండాలి. సాధించాలనే కసి ఉప్పొంగాలి.. అప్పుడే ప్రకృతి విసిరే సవాళ్లను సైతం అధిగమించవచ్చు. కరోనా కట్టడిలో అయినా, తుపాను విపత్తు సమయంలో అయినా ఆయన చేసింది అదే. కడలి కల్లోలం నుంచి జనాలను ఒడ్డున పడేశారు. కరోనా వైరస్ కోరల్ని కత్తిరించారు. ఇంతకీ ఎవరాయన?. ఏమిటా ఆ సక్సెస్ స్టోరీ?. 


ఆయన ప్రజా సేవ చేయాలనుకున్నారు. పట్టుదలతో సివిల్ సర్వీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కలెక్టర్‌గా వంద రోజుల్లోనే జేజేలు కొట్టించుకున్నారు. తానేంటో నిరూపించుకున్నారు. ఆయనెవరో కాదు...గుంటూరు జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ శాఖమూరి. ప్రజా సేవలో చంద్రశేఖర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందరిలో ఒకరిలా కాకుండా ప్రజల మనసుల్లో చెరగని సంతకం వేస్తున్నారు. చంద్ర శేఖర్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని ఐఏఎఫ్‌టీ నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2007లో ఆయన యూపీఎస్సీ పరీక్ష ఉత్తీర్ణులై ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కలెక్టర్ కావాలనే పట్టుదలకు మరింత పదును పెట్టి 2011లో సాధించారు. 


తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు చాలా శాఖల్లో విధులు నిర్వర్తించారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రికి సెక్రటరీగా కూడా పని చేశారు. తమిళనాడులోని కడలూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. 


Updated Date - 2020-12-29T01:01:10+05:30 IST