‘కాలం, పరిస్థితులు, సమీకరణాలు మారాయి కానీ, కాంగ్రెస్ ఆలోచనా ధోరణి మారలేదు’

ABN , First Publish Date - 2020-06-25T20:56:36+05:30 IST

కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానం పట్ల అనుసరిస్తున్న తీరును బీజేపీ

‘కాలం, పరిస్థితులు, సమీకరణాలు మారాయి కానీ, కాంగ్రెస్ ఆలోచనా ధోరణి మారలేదు’

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానం పట్ల అనుసరిస్తున్న తీరును బీజేపీ సీనియర్ నేత సుధాంశు త్రివేది గురువారం తీవ్రంగా ఎండగట్టారు. 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజులను గుర్తు చేసుకుంటూ, కాలం మారినా, కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదని దుయ్యబట్టారు. 


1975 జూన్ 25న దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో గురువారం సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రథమ కుటుంబ ఆలోచనా ధోరణికి వంత పాడటం కొనసాగిస్తున్నారని, పార్టీ కన్నా ఒక కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. 


కాలం, పరిస్థితులు, సమీకరణాలు మారాయని, కానీ (కాంగ్రెస్) ఆలోచనా ధోరణి మారడం లేదని అన్నారు. నేడు కూడా ఆ పార్టీ ప్రథమ కుటుంబం పట్ల విధేయత కనబరిచే కాకి గోల చేస్తోందన్నారు. కాంగ్రెస్ గళాలన్నీ విధేయతను వ్యక్తపరిచేందుకు కాకి గోల పెడుతున్నాయన్నారు. 


ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ 1977 మార్చి 21 వరకు కొనసాగింది. 


కాంగ్రెస్ ఒక కుటుంబాన్ని కాపాడటం కోసం విధించిన చీకటి రోజు గురించి మనకు కేంద్ర మంత్రి అమిత్ షా తన ట్వీట్ ద్వారా గుర్తు చేశారని సుదాంశు త్రివేది అన్నారు. ఎమర్జెన్సీ విధించిన రోజు మన రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజు అని తెలిపారు. వారసత్వ పాలన ధోరణి నేటికీ కొనసాగుతోందన్నారు. 


అమిత్ షా ఇచ్చిన ట్వీట్‌లో కాంగ్రెస్‌‌ను ఆత్మావలోకనం చేసుకోవాలని కోరారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.


Updated Date - 2020-06-25T20:56:36+05:30 IST