కలిస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం.. లేదంటే... : సచిన్ పైలట్

ABN , First Publish Date - 2020-08-20T19:02:05+05:30 IST

అందరూ కలిసి కట్టుగా ముందుకెళితేనే వచ్చే ఎన్నికల్లో విజయం తిరిగి వరిస్తుందని యువనేత

కలిస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం.. లేదంటే... : సచిన్ పైలట్

జైపూర్ : అందరూ కలిసి కట్టుగా ముందుకెళితేనే వచ్చే ఎన్నికల్లో విజయం తిరిగి వరిస్తుందని యువనేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులేనని హెచ్చరించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన రాజస్థాన్ పీసీసీ కార్యాలయంలో మాట్లాడారు.  ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలకే వర్తించదని... వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే సూత్రం మీద నడవాలని పిలుపునిచ్చారు. కలిసి కట్టుగా పని చేయాలని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేరిస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని పరోక్షంగా సీఎం గెహ్లోత్‌కు చురకలంటించారు. 

ఇద్దరి మధ్య ఇంకా తగ్గని విభేదాలు?

తిరుగుబాటు బావుటా ఎగరేసి... ఆ కథ సుఖాంతంగా ముగిసిన తర్వాత మొదటి సారి సచిన్ పైలట్ రాజస్థాన్ పీసీసీ కార్యాలయానికి వచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 నిమిషాలకు సీఎం గెహ్లోత్ కూడా రావాల్సి ఉండింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది పార్టీ. అయితే... సీఎం గెహ్లోత్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరిద్దరు ముఖా ముఖిగా కలుసుకున్నా, బల పరీక్షలో విజయం సాధించినా... వీరిద్దరి మధ్య విభేదాలు మాత్రం అలాగే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-08-20T19:02:05+05:30 IST