ఆహారపు అలవాట్ల ‘సోషల్’ కాపీయింగ్
ABN , First Publish Date - 2020-02-08T09:56:18+05:30 IST
సోషల్ మీడియా వినియోగదారులు తమ స్నేహితుల ఆహారపు అలవాట్లను కాపీ కొట్టే ప్రయత్నం ...

లండన్, ఫిబ్రవరి 7 : సోషల్ మీడియా వినియోగదారులు తమ స్నేహితుల ఆహారపు అలవాట్లను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని యూకేలోని యాస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఇష్టమైన ఆహార పదార్థాలకు సంబంధించి ఇతరులు పెట్టే పోస్టులతో ప్రభావితమై ఈవిధంగా చేస్తున్నారని గుర్తించారు. ఈక్రమంలో కొంతమంది జంక్ ఫుడ్, చక్కెర మోతాదు అధికంగా ఉండే శీతల పానీయాలను మితిమీరి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లలో ‘సోషల్’ స్నేహితులను అనుకరించే క్రమంలో ఏ పదార్థాన్ని ఎంతమేర తింటున్నారనేది కూడా పట్టించుకోకపోవడంతో.. కొత్త ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని విశ్లేషించారు. కొందరు నెటిజన్లు మాత్రం స్నేహితుల స్ఫూర్తితో పండ్లు, కూరగాయల వాడకం పెంచి ఆర్యోగకర జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నారన్నారు.