మారిషస్‌లో చిక్కుకున్న నాందేడ్ విద్యార్థులు
ABN , First Publish Date - 2020-03-25T00:52:29+05:30 IST
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నేపథ్యంలో మహారాష్ట్ర విద్యార్థులు మారిషన్‌లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సేవలను నిలిపేయడంతో వీరు తిరిగి మన దేశానికి రాలేకపోతున్నారు.

ముంబై : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నేపథ్యంలో మహారాష్ట్ర విద్యార్థులు మారిషన్‌లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సేవలను నిలిపేయడంతో వీరు తిరిగి మన దేశానికి రాలేకపోతున్నారు.
మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి అశోక్ చవాన్ మంగళవారం మాట్లాడుతూ నాందేడ్‌కు చెందిన హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఆరుగురు ఇంటర్న్‌షిప్ కోసం మారిషస్ వెళ్ళారని చెప్పారు. ఈ విద్యార్థులు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపేయడం వల్ల తిరిగి నాందేడ్ రాలేకపోతున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు చవాన్ రాసిన లేఖలో ఈ విద్యార్థులు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అభ్యసిస్తున్నారని తెలిపారు. నాలుగు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుని మంగళవారం వీరు తిరిగి నాందేడ్ రావలసి ఉందని తెలిపారు. వీరి వీసాల గడువు బుధవారంతో ముగియబోతోందని, వీరు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనకుండా చూడటం కోసం, వీరి వీసాల గడువును పెంచేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు.
మారిషస్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించేందుకు ఈ విద్యార్థులు ప్రయత్నించారని, అయితే వారికి ఎటువంటి స్పందన దొరకలేదని తెలిపారు. వీరికి వసతి సదుపాయాలను ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేయాలన్నారు.