ఫరీదాబాద్ యువతి హత్యకేసు.. నిందితులిద్దరూ దొరికారు!

ABN , First Publish Date - 2020-10-28T00:19:26+05:30 IST

హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై 21 ఏళ్ల యువతిని కాల్చి చంపిన కేసులో నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు.

ఫరీదాబాద్ యువతి హత్యకేసు.. నిందితులిద్దరూ దొరికారు!

న్యూఢిల్లీ: హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై 21 ఏళ్ల యువతిని కాల్చి చంపిన కేసులో నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకిని వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వారిద్దరూ ప్రస్తుతం రెండు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నట్టు తెలిపారు. యువతిని కాల్చి చంపుతున్న వీడియో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 


ఈ హత్యకేసుపై ఏసీపీ (క్రైం) అనిల్ కుమార్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. దర్యాప్తు త్వరగా పూర్తి చేసి బాధిత కుటుంబాన్ని న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. 


ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌గఢ్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. ఇద్దరు యువకులు బాధితురాలిని అపహరించేందుకు ప్రయత్నించారు. ఆమె తిరగబడడంతో నిందితుల్లో ఒకడు రివాల్వర్ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.


ఫరీదాబాద్ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులు తౌసీఫ్, అతడి స్నేహితుడు రేహాన్‌లను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు తౌసీఫ్‌కు బాధితురాలు ముందే తెలుసని, 2018లో కూడా ఆమెను కిడ్నాప్ చేసినట్టు పోలీసు అధికారి ఓపీ సింగ్ తెలిపారు.

Updated Date - 2020-10-28T00:19:26+05:30 IST