మీ ఇంటికి మేం పంపించం.. మీరే వెళ్లండి.. క్వారంటైన్ అధికారుల తీరుతో విద్యార్థులు షాక్
ABN , First Publish Date - 2020-04-25T21:56:41+05:30 IST
నలభై రోజుల క్రితం ఇరాన్ నుంచి కొందరు విద్యార్థులను విమానంలో భారత్ తీసుకొచ్చారు. వారిని రాజస్థాన్‌లోని...

జైసల్మేర్: నలభై రోజుల క్రితం ఇరాన్ నుంచి కొందరు విద్యార్థులను విమానంలో భారత్ తీసుకొచ్చారు. వారిని రాజస్థాన్‌లోని జైసల్మేర్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించి కరోనా పరీక్షలు చేస్తూ 14 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే ఇద్దరికీ అనేక సార్లు పరీక్షలు చేసినా నెగెటివ్ రావడంతో గడువు ముగియగానే ఇంటికి వెళ్లిపోమని చెప్పారు. సాధారణంగా అయితే ఇద్దరూ తమ ఇంటికి ఆనందంగా వెళ్లిపోయేవారు. కానీ వారు మాత్రం షాక్‌కు గురయ్యారు. కారణం వారి ఇళ్లు పక్క వీధిలో కాదు.. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్ దినజ్‌పూర్, బీహార్‌లోని ముజఫరాపూర్‌లలో. దీనిపై ఓ విద్యార్థి మిన్‌హజ్ మాట్లాడుతూ ‘మిమ్మల్ని మేము ఇంటికి పంపించం. మీ అంతట మీరే వెళ్లండి’ అని క్వారంటైన్ అధికారులు చెప్పారని, దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే అంత దూరంలో ఉన్న ఇంటికి ఎలా వెళ్లాలని వాపోయాడు. తమతో పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉన్న విద్యార్థులు, తదితరులను కాశ్మీర్‌లోని వారి ఇళ్లకు పంపుతున్నారని, కేవలం తమతో మాత్రమే అధికారులు ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ‘ఇక్కడ నుంచి వెళ్లాలంటే సాధారణంగానే రూ.60 వేలు ఖర్చవుతాయి. నేను స్కాలర్‌షిప్పులపై ఇరాన్‌లో చదువుకుంటున్నా. ఇంత ఖర్చు నా కుటుంబం భరించలేదు. ప్రభుత్వమే చర్య తీసుకుని నన్ను ఇంటికి పంపించాలి’ అని మిన్‌హజ్ కోరుతున్నాడు. తనను ఇంటికి తీసుకెళ్లమంటూ తన ఇంటికి కూడా ఇక్కడి అధికారులు ఫోన్ చేశారని చెప్పాడు. మరో విద్యార్థి మహమ్మద్ కూడా ఇదే విధంగా బాధపడుతున్నాడు. తన కుటుంబం బీహార్‌లోని ముజఫరాబాద్‌లో ఉంటుందని, అక్కడికి తనంతట తాను ఎలా వెళ్లగలనని ప్రశ్నించాడు. తన ఇంటికి కూడా అధికారులు ఫోన్ చేశారని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే క్వారంటైన్ సెంటర్‌కు చెందిన అధికారులు మాత్రం తమ వద్ద క్వారంటైన్‌లో ఉన్న 457 మందిని మూడు సార్లుగా శ్రీనగర్, లడఖ్‌లలోని వారి ఇళ్లకు పంపించామని ఓ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై రక్షణశాఖ ప్రధాన ప్రతినిధి కోల్ సొంబిత్ ఘోష్‌ను ప్రశ్నించగా జైసల్మేర్‌లోని క్వారంటైన్ సెంటర్ సైన్యం ఆధీనంలో ఉన్న మాట వాస్తవమేనని, అయితే అక్కడి నుంచి ఎవరిని, ఎప్పుడు ఇళ్లకు పంపించాలనే విషయం మాత్రం హోం శాఖ ఆధీనంలో ఉంటుందని తెలిపారు. ఎవరిని, ఎప్పుడు.. ఎక్కడికి పంపించారనే దాని గురించి తనకేమీ తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.