కారకులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-05-08T09:32:05+05:30 IST

విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ప్రధాని మోదీ చలించిపోయారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న మరుక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం

కారకులపై కఠిన చర్యలు

  • ప్రమాదంపై విచారణ... ‘విశాఖ’పై ప్రధాని తక్షణ ఆదేశం
  • ప్రమాద మూలం, ప్రభావంపై అత్యవసర ఉన్నతస్థాయి భేటీ


న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ప్రధాని మోదీ చలించిపోయారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న మరుక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు.  గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీకి దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా సమీక్షించారు. లీకేజీకి పాల్పడి, ప్రజల ప్రాణాలను బలిగొన్న పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని.. సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు.


ఈ ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర రసాయనశాఖ కార్యదర్శి ఉంటారు. బాధితులు త్వరితగతిన కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. ప్రమాద విషయం తెలియగానే ‘నేను చలించిపోయాను’ అని అమిత్‌షా అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తొలుత ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ.. సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు.  అసలేం జరిగిందని ప్రశ్నించారు. దీంతో ప్రాథమిక సమాచారాన్ని మోదీకి జగన్‌ చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం దన్నుగా ఉంటుందని, సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలంతా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఏఐసీసీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 


లీకేజీ కట్టడికి గుజరాత్‌ నుంచి రసాయనం: కిషన్‌రెడ్డి

గ్యాస్‌ లీకేజీని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన పీటీబీసీ (పారా-టెరిటరీ బుటిల్‌ కేటెకోల్‌)అనే రసాయనాన్ని గుజరాత్‌ నుంచి తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక విమానంలో డామన్‌ విమానాశ్రయం నుంచి 500 కిలోల రసాయనాన్నీ, పుణె నుంచి కెమికల్‌ నిపుణులనూ పంపినట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-08T09:32:05+05:30 IST