క్రిమిరహితంగా మాస్క్‌, ఫోన్‌, కూరగాయలు

ABN , First Publish Date - 2020-05-09T09:50:05+05:30 IST

ఫేస్‌ మాస్క్‌, సెల్‌ఫోన్‌, పండ్లు, కూరగాయల.. వాడకం, నిర్వహణపై అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పలు సూచనలు చేసింది. అవేమిటంటే.. పండ్లు, కూరగాయలు కొని

క్రిమిరహితంగా మాస్క్‌, ఫోన్‌, కూరగాయలు

వాషింగ్టన్‌, మే 8 : ఫేస్‌ మాస్క్‌, సెల్‌ఫోన్‌, పండ్లు, కూరగాయల.. వాడకం, నిర్వహణపై అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పలు సూచనలు చేసింది. అవేమిటంటే.. పండ్లు, కూరగాయలు కొని ఇంటికి తేగానే నీళ్లతో కడగడంతోపాటు వెంటనే చేతులను శుభ్రం చేసుకోవాలి. వాడిన మాస్క్‌లు, గ్లవ్స్‌ను ఎప్పటికప్పుడు వేడి నీళ్లలో సబ్బు లేదా సర్ఫ్‌తో ఉతుక్కోవాలి. మృదువైన వస్త్రంతో ఫోన్‌లు, కంప్యూటర్‌ కీ బోర్డుల ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి. ఇందుకు 70 శాతం ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ లేదా క్లోరాక్స్‌ క్రిమిసంహారకాన్ని వాడొచ్చని సీడీసీ సూచించింది. అయితే వాటిని నేరుగా కాకుండా ఓ వస్త్రంపై స్ర్పే చేసి అద్దాలని తెలిపింది.


బడిలో భలే జాగ్రత్తలు

కరోనాకు పుట్టిల్లయిన చైనాలో ఇప్పుడు పాఠశాలలను కూడా తెరిచారు. పిల్లలకు వైరస్‌ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బడి గేటు వద్దే వారి బూట్ల దగ్గర్నుంచీ చేతులు, దుస్తులు, పుస్తకాల సంచి అన్నింటినీ శానిటైజ్‌ చేస్తున్నారు. వారు ధరించి వచ్చిన మాస్కులను అక్కడే ఒక చెత్తబుట్టలో పడేస్తున్నారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌తో వారి శరీర ఉష్ణోగ్రతలను చూస్తున్నారు. అంతా బాగున్న పిల్లలను క్లాస్‌రూములోకి పంపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చుగానీ.. భవిష్యత్తులో మనదేశంలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి.. పదో తరగతి, ఇంటర్‌ వంటి పరీక్షలు రాయనున్న విద్యార్థులు మాస్క్‌, భౌతికదూరం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తే మంచిది.


కూరగాయలు కొనడానికి వెళ్లినప్పుడు గ్లవ్స్‌ ధరించి వెళ్లండి. కుదరకపోతే ప్లాస్టిక్‌ కవర్‌ను చేతికి తొడుక్కుని దాంతో కూరగాయలను సంచిలో వేసుకోండి. వీలైనంతవరకూ నగదు లావాదేవీలు చేయొద్దు. పేటీయం, గూగుల్‌పే వంటివి వారి వద్ద ఉన్నాయేమో అడిగి ఆ పద్ధతిలో చెల్లించండి. లేదా తగినంత డబ్బును చిల్లర, నోట్ల రూపంలో తీసుకెళ్లి అవసరమైన సొమ్మును చెల్లించండి. మళ్లీ చిల్లర తీసుకునే అవసరం రాకుండా చూసుకోండి. ఇంటికి తెచ్చిన కూరగాయలను.. ‘తినే సోడా (బేకింగ్‌ సోడా)’ కలిపిన నీటిలో వేసి శుభ్రం చేయండి.

Updated Date - 2020-05-09T09:50:05+05:30 IST