దమ్మాలపాటి కేసులో దర్యాప్తుపై స్టే!
ABN , First Publish Date - 2020-11-26T06:40:23+05:30 IST
రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. అదేసమయంలో, ఈ కేసు వివరాలు మీడియాలో రాకూడదన్న (గ్యాగ్) ఆదేశాలను

జనవరి నెలాఖరు వరకు
దమ్మాలపాటి పిటిషన్‌పై నిర్ణయం వద్దు
హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ
హోరాహోరీగా కొనసాగిన వాదనలు
హైకోర్టు ఆదేశాలే కొనసాగింపు.. జోక్యం చేసుకోని సుప్రీం కోర్టు.. ‘గ్యాగ్’ ఉత్తర్వులపై స్టే ఎత్తివేత
న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. అదేసమయంలో, ఈ కేసు వివరాలు మీడియాలో రాకూడదన్న (గ్యాగ్) ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. ఏసీబీ దర్యాప్తు నిలిపివేతతోపాటు గ్యాగ్ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం విలేకరుల సమావేశం పెట్టి వివరాలన్నీ వెల్లడించడంతో తమ ‘గ్యాగ్ ఆర్డర్’ నిష్ఫలమైందని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపై ఉన్న స్టేను ఎత్తివేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. విచారణలో భాగంగా తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్, ఆ తర్వాత దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ సుదీర్ఘంగా వాదనలు వినిపించారు.
‘‘నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సెప్టెంబరు 15న హైకోర్టు ఆదేశాలివ్వగా... ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. అంటే... హైకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లే’’ అని దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తేల్చిచెప్పారు. అయితే... హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసినందునే సమాధానం ఇవ్వలేదేమో అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దాని గురించి తెలుసుకుంటామని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు తప్పుగా ఉంటే స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టునే ఆశ్రయించి ఉండాల్సిందని సాల్వే అన్నారు. ఎవరిపైన అయినా ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు జరపాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఈసందర్భంగా ప్రశ్నించారు.
రాజధాని భూములపై మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసిందని, ఆ తర్వాత 7 నెలలకు ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని దమ్మాలపాటి హైకోర్టులో విజ్ఞప్తి చేయలేదని, ముందస్తు బెయిల్ మంజూరుతోపాటు ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను మీడియా ప్రచురించకుండా అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. కానీ... హైకోర్టు మాత్రం దర్యాప్తును నిలిపివేసిందన్నారు. ‘‘దర్యాప్తును హైకోర్టు ఎలా ఆపగలదు? ఎఫ్‌ఐఆర్‌లో 13 మంది పేర్లు ఉన్నాయి. దమ్మాలపాటి ఒక్కరే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం అందరికీ ఉపశమనం కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చింది’ అని ధవన్ వివరించారు. దీనిపై దర్యాప్తు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని సీబీఐ తోసిపుచ్చిందన్నారు. ‘హైకోర్టు ఇలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చా’ అన్నదే తమ ప్రశ్న అని ధవన్ పేర్కొనగా ‘అది వేరే అంశం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.