కేరళలో వందకు చేరువైన కోవిడ్-19 కేసులు... రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశాలు...

ABN , First Publish Date - 2020-03-24T01:03:38+05:30 IST

కేరళలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 95కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 28 నోవెల్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి...

కేరళలో వందకు చేరువైన కోవిడ్-19 కేసులు... రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశాలు...

తిరువనంతపురం: కేరళలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 95కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 28 నోవెల్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక మహమ్మారి ఒక్కసారిగా వేగం పుంజుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించింది. రాష్ట్రం నలుమూలలా సరిహద్దులు మూసివేస్తున్నామనీ... ప్రజా రవాణా సదుపాయాలను కూడా నిలిపివేస్తున్నామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. 


సామాజిక దూరాన్ని (సోషల్ డిస్టెన్సింగ్) పెంచాల్సిన అవసరం ఉన్నందున ప్రజా రవాణాను నిలిపివేస్తున్నామనీ.. బయటి వ్యక్తులు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దులు మూసి వేశామని సీఎం వివరించారు. ప్రజల మధ్య రాకపోకలు నిలిపివేసేందుకు జిల్లా సరిహద్దుల వద్ద కూడా పహారా ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఆలయాలు, చర్చిలు, మసీదులు సహా ఇప్పటి వరకు మినహాయించిన అన్ని ఆథ్యాత్మిక స్థలాలను కూడా పరిస్థితి మెరుగయ్యే వరకు మూసివేస్తున్నట్టు విజయన్ పేర్కొన్నారు. ఇవాళ అర్థరాత్రి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు. కాగా ఫార్మసీలు సహా అన్ని నిత్యావసరాల షాపులను ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తామన్నారు. 

Updated Date - 2020-03-24T01:03:38+05:30 IST