చార్జీల వసూలు వద్దు
ABN , First Publish Date - 2020-05-29T07:13:39+05:30 IST
లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల నుంచి రైలు, బస్సు చార్జీలను వసూలు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారికి అవసరమైన భోజన, మంచినీటి సదుపాయాలను సంబంధిత రాష్ట్రాలే కల్పించాలని స్పష్టం...

- వలస కార్మికుల ప్రయాణ ఖర్చుల భారం రాష్ట్రాలదే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, మే 28: లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల నుంచి రైలు, బస్సు చార్జీలను వసూలు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారికి అవసరమైన భోజన, మంచినీటి సదుపాయాలను సంబంధిత రాష్ట్రాలే కల్పించాలని స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్లుతున్న వలస కార్మికుల దుర్భర పరిస్థితులపై వచ్చిన మీడియా కథనాలను న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తొలుత మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసును మళ్లీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం రెండున్నర గంటలపాటు విచారించిన తర్వాత పలు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల ప్రయాణ ఖర్చులను రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. పేర్లు నమోదు చేసుకున్న కార్మికులను వీలైనంత త్వరగా రైలో, బస్సో ఎక్కించి పంపించాలని ధర్మాసనం ఆదేశించింది. వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించాలంటూ తాము అన్ని రాష్ట్రాలనూ ఆదేశించినట్లు కేంద్రం తరఫున ఎస్జీ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
స్వస్థలాలకు వెళ్లే వలస కార్మికులలో 80 శాతం మందిదాకా యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని ఆయన చెప్పారు. వారిని తరలించేందుకు ఈనెల 1 నుంచి 27 వరకు 3700 రైళ్లను నడిపామని, 91 లక్షల మందికి పైగా కార్మికులను తరలించామని ఆయన కోర్టుకు తెలిపారు. కాగా, సొంతంగా టిక్కెట్టు కొని ఇతర ఖర్చులు పెట్టుకుని వచ్చిన తమ రాష్ట్ర కార్మికులకు తాము డబ్బును చెల్లిస్తున్నామని బిహార్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.