రజనీకాంత్ ఆయన్నెందుకు పెట్టుకున్నారో..? స్టాలిన్
ABN , First Publish Date - 2020-12-07T21:25:04+05:30 IST
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రధానంగా పోటీ పడనున్నట్లు నిన్నటి వరకు ఊహగాణాలు ఉన్నాయి. అయితే రజనీ రాజకీయ పార్టీ త్రికూటమిగా నిలబడుతుందా లేదా తెలియాలి. ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ స్థాపించి

చెన్నై: వచ్చే ఏడాదిలో జనవరిలో పార్టీ స్థాపించబోతున్నట్లు సినీ హీరో రజనీకాంత్ చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, ఎవరైనా పార్టీ స్థాపించొచ్చని, ఆ ఈ దేశ రాజ్యాంగం కల్పించిన హక్కని ఆయన అన్నారు. ముందైతే పార్టీ స్థాపించనివ్వండని చెప్పిన ఆయన వారి రాజకీయ వైఖరి ఏంటో తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని స్టాలిన్ అన్నారు.
‘‘ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించొచ్చు. ముందు రజనీకాంత్‌ను పార్టీ స్థాపించనివ్వండి. ముందు వారి రాజకీయ విధివిధానాలేమిటో తెలియాలి. ఆ తర్వాత నేను దానిపై స్పందిస్తాను. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. తమిళరువి మణియమ్‌ను ఎందుకు రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారో తెలియడం లేదు’’ అని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రధానంగా పోటీ పడనున్నట్లు నిన్నటి వరకు ఊహగాణాలు ఉన్నాయి. అయితే రజనీ రాజకీయ పార్టీ త్రికూటమిగా నిలబడుతుందా లేదా తెలియాలి. ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ స్థాపించి గత సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగిన కమల్ హాసన్.. ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో తమిళ రాజకీయాలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉన్నాయనేది స్పష్టమైంది. మరి రజనీ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.