‘వారిని పరామర్శించే విశేషాలు ఏవీ లేవు’

ABN , First Publish Date - 2020-04-15T12:46:28+05:30 IST

‘వారిని పరామర్శించే విశేషాలు ఏవీ లేవు’

‘వారిని పరామర్శించే విశేషాలు ఏవీ లేవు’

చెన్నై, (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞల వల్ల జీవనోపాధి కోల్పోయి గృహనిర్బంధం పాటిస్తున్న సామాన్యుల మదిలో మెదలుతున్న ప్రశ్నలకు బదులిచ్చేలా ప్రధాని మోదీ ఎప్పుడు ప్రసంగం చేస్తారని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రశ్నించారు. ఈ మేరకు  ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం అడుగుతున్న ప్రశ్నల వెనుక దాగిన ధర్మం, న్యాయం ప్రధాని మోదీకి అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. దేశమంతటా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో మంగళవారం ఉదయం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించిన ప్రసంగంలో లాక్‌డౌన్‌ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు చేసిన ప్రకటన తప్ప సామాన్య ప్రజలను పరామర్శించే విశేషాలు ఏవీ లేవని విమర్శించారు. కరోనా సోకిన వ్యక్తులందరినీ గుర్తించలేని పరిస్థితుల్లో, ఆ వైరస్‌ సోకిన బాధితులందరికీ క్వారెంటైన్‌లో ఉంచని స్ఙితిలో నిషేధాజ్ఞలను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని పూర్తిగా అర్థం చేసుకోగలిగిన ప్రజలు స్వీయగృహనిర్బంధంలో ఉండటానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని గురించి మరింత అవగాహన కల్పించే విధంగా ప్రధాని ఏడు రకాల నియమాలను పునరుద్ఘాటించడం మినహా కీలకమైన అంశాలను గురించి ప్రస్తావించనేలేదన్నారు. దేశ పౌరులంతా ప్రధాని మోదీ నుంచి సలహాలను మాత్రమే ఎదురు చూడటం లేదని, కరోనా తాకిడికి సంపాదనను పూర్తిగా కోల్పోయి జీవనోపాధిలేని దుస్థితిలో ఉన్న తమకు ఆర్థికపరమైన సహయాలు, వస్తురూపేణా సహాయాలు చేస్తామని ప్రకటనలు చేస్తారని ఆశగా ఎదురు చూసి మోసపోయారని స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి గతంలో చేసిన ప్రసంగాలలోనూ, తాజా ప్రసంగంలోనూ దేశ పౌరుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు అవసరమైన ఎలాంటి ప్రకటనలు చేయలేదన్నారు.


ప్రజలంతా గృహనిర్బంధంలో ఉన్నారంటూ దేశం యావత్తూ స్తంభించిపోయిందని భావించాలని, అగమ్యగోచరంలో ఉన్న తమకు ప్రధాని రాయితీలు, ఆర్థిక సహాయాలు ప్రకటిస్తారని ఎదురు చూసి చూసి విసిగివేసారి వున్నారన్నారు. కరోనా వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడటంతో సరిపోదని, ఇంటిపట్టునే గడుపుతున్న ఆ ప్రజలను ఆర్థికపరంగాను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రధానిపై ఉందని, ఇందుకు సంబంధించిన పథకాలను గురించి గతంలోనే ప్రకటించి ఉండాల్సిందని అన్నారు.  ప్రస్తుతం కరోనా నిరోధక నిషేధాజ్ఞల వల్ల రోజువారి సంపాదనను కోల్పోయి శోకసముద్రంలో కొట్టుమిట్లాడుతున్న ఆ అభాగ్యులను కాపాడేందుకు ప్రధాని మోదీ చేపట్టనున్న చర్యలు ఏమిటి? ప్రకటించనున్న సహాయకాలు ఏమిటి? అని స్టాలిన్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2020-04-15T12:46:28+05:30 IST