క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి.. కీలక పదవి!
ABN , First Publish Date - 2020-12-05T16:56:24+05:30 IST
క్రికెటర్ కావాలని కలలు గన్న బీవీ శ్రీనివాస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

- జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్
- ఎన్ఎస్యూఐలో చురుకైన పాత్ర
- ప్రమోద్ మతాలిక్ ముఖానికి మసిపూయడంతో ఇమేజ్
- కర్ణాటక యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సేవలు
బెంగళూరు : క్రికెటర్ కావాలని కలలు గన్న బీవీ శ్రీనివాస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఏకంగా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కర్ణాటక కాంగ్రెస్‌లో అత్యంత చురుకైన పాత్రను పోషించిన శ్రీనివాస్‌కు పార్టీ అధిష్ఠానం జాతీయ స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణానికి చెందిన శ్రీనివాస్ ప్రాథమిక విద్యను ఇక్కడే పూర్తిచేసి, తన తాత బి.రామయ్యతో కలిసి బెంగళూరు వచ్చారు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువను పెంచుకున్న ఆయన బెంగళూరులో అండర్-14, అండర్-19 జట్లకు ఎంపికయ్యారు.
బెంగళూరు నేషనల్ కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐలో చురుకైన పాత్రను పోషించారు. 2010లో శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ మతాలిక్ ముఖానికి మసిపూసిన ఘటన అనంతరం కాంగ్రెస్‌లో శ్రీనివాస్ ఇమేజ్ బాగా పెరిగింది. కర్ణాటక యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసి కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించారు. శ్రీనివాస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో కీలక పదవిని పొందడంతో భద్రావతి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్నేహితులు, అభిమానులు బాణసంచా కాల్చి, మిఠాయిలను పంచిపెట్టారు.
