స్పోర్ట్స్‌ అడ్డాగా కాశ్మీర్‌.. కొత్తగా మరో ఇండోర్‌ స్టేడియం

ABN , First Publish Date - 2020-10-12T18:52:04+05:30 IST

జమ్మూ కాశ్మీర్‌ రూపం మారుతోంది. ఇన్నాళ్లూ తూటాలు, తుపాకులు మాత్రమే కనిపించే కాశ్మీర్‌లో ఇప్పుడు బ్యాట్‌లు, బంతులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులతో పాటు యువత కూడా క్రీడలవైపు...

స్పోర్ట్స్‌ అడ్డాగా కాశ్మీర్‌.. కొత్తగా మరో ఇండోర్‌ స్టేడియం

జమ్మూ కాశ్మీర్‌ రూపం మారుతోంది. ఇన్నాళ్లూ తూటాలు, తుపాకులు మాత్రమే కనిపించే కాశ్మీర్‌లో ఇప్పుడు బ్యాట్‌లు, బంతులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులతో పాటు యువత కూడా క్రీడలవైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కాశ్మీర్‌లో కొత్తగా క్రీడా మైదానాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొద్ది నెలల క్రితం రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో దివంగత నేత అరుణ్‌ జైట్లీ పేరు మీద అదిపెద్ద స్టేడియాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఒకపక్క ఆ స్టేడియం నిర్మాణ పనులు జరుగుతుండగానే మరోపక్క ప్రత్యేకంగా ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. లెఫ్టనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా  ఈ ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. 


పేరుకు ఇండోర్‌ స్టేడియం అయినప్పటికీ ఇందులో హాకీ, రగ్బీ, వాలీబాల్‌ వంటి అనేక అవుట్‌డోర్‌ క్రీడలు కూడా ఆడేందుకు గ్రౌండ్స్‌ ఏర్పాటు చేశారు. టేబుల్‌ టెన్నిస్‌, కబడ్డీ, క్యారమ్స్‌, చెస్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌కు ప్రత్యేక హాల్స్‌ను నిర్మించారు. అంతేకాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌ కళలైన జూడో, థాంగ్తా, పెంచెక్‌ స్లాట్‌, ఊషూ వంటి వాటి కోసం కూడా ప్రత్యేక హాల్స్‌ను ఏర్పాటు చేశారు. చలికాలంలో కూడా ఈ స్టేడియం పనిచేస్తుందని, ఏడాది పొడవునా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయని ఇక్కడి ట్రెయినర్‌లు చెబుతున్నారు.


స్టేడియం ప్రారంభించడంపై లెఫ్టనెంట్‌ మనోజ్‌ సిన్హా  మాట్లాడుతూ, కాశ్మీర్‌లో చిన్నారులు, యువతను క్రీడల వైపు మళ్లించడమే ప్రభత్వ ముఖ్య ఉద్దేశ్యమని, అందుకనుగుణంగానే ప్రత్యేకంగా స్టేడియంల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని చెప్పారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి మెరుగైన శిక్షణనందించి గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇక్కడి శిక్షకులు పనిచేస్తారని, కాశ్మీర్‌ను దేశంలోనే స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చడమే ప్రధాన ధ్యేయమని అన్నారు. ఇప్పటికే కాశ్మీర్‌ యువత ప్రపంచ స్థాయిలో అనేక స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, అలాంటి క్రీడాకారులకు ఈ స్టేడియం మరింత తోడ్పాటు నందిస్తుందని మనోజ్‌ సిన్హా  చెప్పుకొచ్చారు.


జమ్మూ-కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ తొలగింపు తర్వాత అక్కడి పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఇన్నాళ్లూ కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ప్రస్తుతం చాలావరకు ప్రశాంత జీవనానికి అలవాటు పడ్డారు. దీంతో చిన్నారులతో పాటు యువత కూడా చదువు, క్రీడలవైపు మక్కువ పెంచుకుంటున్నారు. దానిని గుర్తించే కేంద్రం కూడా స్పోర్ట్స్‌ స్టేడియంల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది.

Updated Date - 2020-10-12T18:52:04+05:30 IST