సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాజస్థాన్ స్పీకర్
ABN , First Publish Date - 2020-07-27T17:02:29+05:30 IST
సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు.

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పీకర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో న్యాయ పోరాటం వద్దని... రాజకీయంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంతోనే స్పీకర్ ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గానికి స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చిన తర్వాత... వారంతా హైకోర్టును ఆశ్రయించారు. తుది తీర్పు వచ్చే వరకూ యథాతథ స్థితినే కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ స్పీకర్ జోషి సుప్రీంలో వ్యాజ్యం వేశారు. దీనిపై సోమవారం సుప్రీం విచారణ జరపనుంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పిటిషన్ ఉపసంహరణకు డిసైడ్ అయ్యింది. అయితే ఈ విషయంపై దీనిపై పార్టీలో చర్చ వచ్చినప్పుడు.. నాయకులు రెండుగా చీలిపోయినట్లు తెలిసింది. వారిలో కొందరు న్యాయపోరాటమే మంచిదని అభిప్రాయపడగా.. సింహభాగం నాయకులు కేసును ఉపసంహరించుకుని, రాజకీయంగా ఎదుర్కోవడమే సరైన నిర్ణయమని తేల్చిచెప్పారు.