ఆగని మృత్యుహేల
ABN , First Publish Date - 2020-04-01T08:05:36+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తన మృత్యువిహారాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కేసులు 8.3 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 41వేలకు పెరిగింది. వైరస్ ఉగ్రరూపం అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీ, ఇరాన్...

41 వేల మరణాలు.. 8.2 లక్షలకు పైగా కేసులు
స్పెయిన్‌లో విలయం.. ఒక్క రోజులో 849 మంది మృతి
ఇటలీలో లాక్‌డౌన్ పొడిగింపు.. జాతీయ పతాకం అవనతం
ఇరాన్, బెల్జియం, నెదర్లాండ్స్‌లో భారీగా మరణాలు
బ్రిటన్‌లోనూ బతుకుతారనుకున్న వారికే వెంటిలేటర్లు
మాడ్రిడ్, మార్చి 31: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తన మృత్యువిహారాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కేసులు 8.3 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 41వేలకు పెరిగింది. వైరస్ ఉగ్రరూపం అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీ, ఇరాన్, బెల్జియం, నెదర్లాండ్స్ కళ్లకు కడుతోంది. స్పెయిన్‌లో ఒక్క రోజే ఏకంగా 849 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8500 కు చేరుతోంది. కేసులు ఇప్పటికే లక్షకు చేరువగా ఉన్నాయి. అయితే వారం క్రితం కంటే ప్రస్తుతం కేసుల నమోదు సంఖ్య 2ు తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీలో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉండడంతో లాక్‌డౌన్‌ను మరో 12 రోజులు పొడిగించారు. మృతుల సంఖ్య 12వేలు దాటిపోయింది. అయితే కేసుల సంఖ్య ఫిబ్రవరి 21న తొలి కేసు వచ్చినప్పటి కంటే క్రమేణా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. మృతులకు నివాళిగా మంగళవారం నాడు ఇటాలియన్లు ఒక నిమిషం మౌనం పాటించారు. జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఇటలీకి సంఘీభావం ప్రకటిస్తూ వాటికన్ సిటీ కూడా తన పతాకాన్ని అవనతం చేసింది. బ్రిటన్‌లో పరిస్థితి గడ్డుగా మారింది. ఒక్క రోజులోనే 381 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1800 కు పెరగడంతో - ఇటలీ, అమెరికా మాదిరిగా బ్రిటన్‌లో కూడా ‘వెంటిలేటర్ రేషనింగ్’ మొదలుపెట్టారు. ‘ఖచ్చితంగా కోలుకుంటారు అన్నవారికి మాత్రమే వెంటిలేటర్ అమరుస్తాం’ అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ స్పష్టం చేసింది. మరోవైపు- డెన్మార్క్, ఆస్ట్రేలియాల్లోనూ కేసుల తీవ్రత తగ్గుతోందని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. భౌతిక దూరం పాటించడంలో దేశప్రజలు విశేష క్రమశిక్షణ చూపారని, త్వరలోనే ఆంక్షల్ని సడలించాలని యోచిస్తున్నామని డెన్మార్క్ ప్రధాని తెలిపారు. ఇరాన్‌లో ఒక్కరోజులో 141 మంది చనిపోగా కేసుల సంఖ్య 45వేలకు పెరిగింది.
అంతిమ ‘యాత్ర’ నిషేధం
కొవిడ్-19 మారణ హోమం సృష్టిస్తుండడంతో స్పెయిన్ ప్రభుత్వం చనిపోయినవారిని ఊరేగింపుగా తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే శవపేటికల వెంట వెళ్లాలని, ఖననాల వద్ద కూడా ముగ్గురు మించి ఉండరాదని ఆంక్ష పెట్టింది.
ఇటలీ డాక్టర్లకు పెనుభారం
ఇటలీలో ఓ రకమైన మానవీయ సంక్షోభం నెలకొంది. దేశ వైద్య ఆరోగ్య రంగంపై ఎన్నడూ లేనంత ఒత్తిడి పెరగిపోవడంతో అటు చికిత్సలు చేయలేక- ఇటు ప్రాణాలు కాపాడుకోలేక డాక్టర్లు, నర్సులు నలిగిపోతున్నారు. ఫిబ్రవరిలో తొలి కొవిడ్ పేషెంట్ నమోదైనప్పటి నుంచీ నేటి దాకా సుమారు 11,250 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకింది. ఇందులో వందల మంది మరణించారు. 71 మంది డాక్టర్లు కూడా చికిత్సలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.