‘సబర్బన్‌ రైళ్లలో ప్రయాణిస్తే రూ.200 జరిమానా’

ABN , First Publish Date - 2020-10-12T13:33:29+05:30 IST

సబర్బన్‌ రైళ్లలో అనుమతి లేకుండా ప్రయాణించే వారికి రూ.200 జరిమానా విధిస్తామని దక్షిణ రైల్వే హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు, సరుకుల రైళ్లు నడుస్తున్నాయి.

‘సబర్బన్‌ రైళ్లలో ప్రయాణిస్తే రూ.200 జరిమానా’

చెన్నై : సబర్బన్‌ రైళ్లలో అనుమతి లేకుండా ప్రయాణించే వారికి రూ.200 జరిమానా విధిస్తామని దక్షిణ రైల్వే హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు, సరుకుల రైళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత నెలలో ప్రత్యేక రైళ్లలో మాత్రమే కోటి మంది ప్రయాణించారు. చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వే పరిధిలో సుమారు 10 లక్షల మంది ప్రయాణించారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 42 ప్రత్యేక సబర్బన్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రభుత్వ అనుమతి పొందిన ఉద్యోగులు మాత్రమే ప్రయాణించాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేశారు. అయితే సబర్బన్‌ రైళ్లలో ప్రజలు, వ్యాపారులు, కొన్ని ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్లు ఫిర్యాదులందాయి. దీనిని అడ్డుకొనేలా టీటీలు గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణాన్ని ప్రజలు మానడం లేదు. అలాగే, రైళ్లలో రద్దీ కూడా పెరుగుతుండడతో కరోనా ప్రబలే అవకాశముంది. దీనిని అడ్డుకొనేలా చర్యలు చేపట్టిన దక్షిణ రైల్వే, అనుమతి లేకుండా, ప్రభుత్వ గుర్తింపుకార్డులు లేకుండా ప్రయాణించే వారికి రూ.200 నుంచి రూ.270 వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసమే నడుపుతున్న సబర్బన్‌ రైళ్లలో ప్రజలు ప్రయాణించరాదని దక్షిణ రైల్వే విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2020-10-12T13:33:29+05:30 IST