దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు!
ABN , First Publish Date - 2020-12-30T08:20:28+05:30 IST
భగభగ మండే సూర్యుడి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత.. 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్! సూర్యుడిపై నిరంతరం జరిగే కేంద్రక సంలీన ప్రక్రియ

భానుడి కేంద్రభాగంలో కన్నా 6.7 రెట్లు
ఎక్కువ ఉష్ణోగ్రత అణు రియాక్టర్‌లో!
భగభగ మండే సూర్యుడి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత.. 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్! సూర్యుడిపై నిరంతరం జరిగే కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా ఇంత ఉష్ణోగ్రత జనిస్తుంది!! ఇంతకు మించిన ఉష్ణోగ్రతను భూమ్మీద సృష్టించగలిగితే? దక్షిణకొరియా శాస్త్రవేత్తలు ఆ అద్భుతాన్ని సాధించారు. ‘కొరియా సూపర్ కండక్టింగ్ టొకామాక్ అడ్వాన్స్ రిసెర్చ్ (కేస్టార్)’ అనే అయస్కాంత కేంద్రక సంలీన పరికరంలో.. 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత 20 సెకన్లపాటు కొనసాగేలా చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు!! పదికోట్ల డిగ్రీలంటే.. సూర్యుడి కేంద్ర భాగం కన్నా దాదాపుగా 6.7 రెట్లు ఎక్కువ వేడి!! కేంద్రక సంలీనం ద్వారా విద్యుదుత్పత్తికి శాస్త్రజ్ఞులు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్సిటీ కలిసి కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలో.. కేస్టార్ ద్వారా ఈ ప్రయోగాలుచేస్తున్నాయి.
2008లోనే వారు తొలిసారి కేస్టార్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్‌ను సాధించగలిగారు. 2018 సెప్టెంబరులో.. 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత 1.5 సెకన్లపాటు కొనసాగేలా చేయగలిగారు. ఆ వేడి 20 సెకన్లపాటు కొనసాగేలా చేయడానికి రెండేళ్లు పట్టింది. 2025 నాటికి.. కనీసం 300 సెకన్లు అంటే ఐదు నిమిషాలపాటు 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగించగలగడమే లక్ష్యంగా వారి ప్రయోగాలు కొనసాగుతున్నాయి.