దేశాలన్నీ కరోనాతో పోరాడుతుంటే.. చైనా మాత్రం..

ABN , First Publish Date - 2020-04-25T03:35:17+05:30 IST

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌పై పోరాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని

దేశాలన్నీ కరోనాతో పోరాడుతుంటే.. చైనా మాత్రం..

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌పై పోరాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే పనిలో బిజీగా ఉంది. ఈ సముద్రంలో ఉన్న పారాసెల్, స్ప్రాటీ దీవులను రెండు జిల్లాలుగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్న చైనా అందుకు సంబంధించి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. చైనా చాలా కాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాలను వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, బ్రూనై వంటి దేశాలు అడ్డుకుంటున్నాయి. ఈ దేశాలతో చైనాకు ప్రాదేశిక జలాలకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ దేశాలను దక్షిణ చైనా సముద్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలన్నది చైనా వ్యూహం. 


తాజాగా, ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతూ దాని నుంచి బయటపడే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాయి. దీనిని అవకాశంగా మార్చుకున్న చైనా.. దక్షిణ చైనా సముద్రంలో చడీచప్పుడు కాకుండా ఆధిపత్య పోరుకు మళ్లీ తెరలేపింది. ఇదే విషయాన్ని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెబుతూ చైనాపై తీవ్ర విమర్శలు చేశారు. వియత్నాంకు చెందిన ఓ ఫిషింగ్ నౌకను చైనా యుద్ధ నౌకలు ముంచి వేశాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయా దేశాలు సహజవాయువు, చమురు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనివ్వకుండా చైనా తన యుద్ధ నౌకలను మోహరిస్తోందని కూడా ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారాలపై భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్ వాణిజ్యంలో దాదాపు 55 శాతం శాతం దక్షిణ చైనా సముద్రంలో భాగమైన మలక్కా జలసంధి ద్వారానే జరుగుతుండడం గమనార్హం. 

Updated Date - 2020-04-25T03:35:17+05:30 IST