అమిత్‌షాతో వేదిక పంచుకోనున్న గంగూలీ
ABN , First Publish Date - 2020-12-28T20:16:15+05:30 IST
బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కేంద్ర హోం మంత్రి ..

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి సోమవారంనాడు వేదిక పంచుకునే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గంగూలీ ఇవాళ ఢిల్లీ చేరుకుని ఫిరోజ్ కోట్లా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే డీడీసీఏ కార్యక్రమంలో పాల్కోనున్నారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను రాజ్‌భవన్‌లో ఆదివారంనాడు గంగూలీ కలుసుకుని గంట సేపు సంభాషించిన అనంతరం ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. పలు అంశాలపై గంగూలీతో చర్చించినట్టు గవర్నర్ ధన్‌కర్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 1864లో నిర్మితమై దేశంలోనే అతి పురాతమైన క్రికెట్ గ్రౌండ్‌గా పేరున్న ఈడెన్ గార్డెన్‌కు విచ్చేయాలంటూ గంగూలీ చేసిన ఆహ్వానానికి తాను సమ్మతి తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాలతో వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్యలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యలో గంగూలీ రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.