పార్టీకి మరో ఝలక్‌ ఇవ్వనున్న సోనియా గాంధీ

ABN , First Publish Date - 2020-09-18T00:26:32+05:30 IST

అసమ్మతి స్వరాలను పక్కకు పెట్టేసి... విధేయతకే పెద్ద పీట వేస్తూ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్‌ని ప్రక్షాళన చేశారు. ఈ మార్పు

పార్టీకి మరో ఝలక్‌ ఇవ్వనున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ : అసమ్మతి స్వరాలను పక్కకు పెట్టేసి... విధేయతకే పెద్ద పీట వేస్తూ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్‌ని ప్రక్షాళన చేశారు. ఈ మార్పు రాజకీయ యవనికపై పెద్ద సంచలనమే కలిగించింది. ఆ షాక్‌ నుంచి కోలుకోక ముందే  రెండోసారి  అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్‌ ను ప్రక్షాళన చేయనున్నారా? అంటే... కాంగ్రెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో ఉన్న నేతలు అవుననే అంటున్నారు. దానికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఈసారి మాత్రం పూర్తి యువకులతో కాంగ్రెస్ ను రంగంలోకి దించనున్నారు.  కాంగ్రెస్ ను సోనియా మరోసారి ప్రక్షాళన దిశగా తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తమై విదేశాలకు వెళ్లిన సోనియా... తిరిగి రాగానే కాంగ్రెస్ లో మరోసారి ప్రక్షాళన చేయనున్నట్లు ఉధృతంగా ప్రచారం జరుగుతోంది.


అయితే ఈ సారి సంస్థాగత ప్రక్షాళనతో పాటు పార్లమెంట్‌ నేతలపై కూడా ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లోకసభలో నేతగా ఉన్న అధీర్‌ రంజన్‌ ను బెంగాల్‌ పీసీసీగా పంపించారు. దీంతో ఆ పదవిలో మరో నేతను నియమించాల్సి ఉంది. దీంతో ఈ పదవికి పార్టీలో భారీగా డిమాండ్‌ పెరిగింది. సీనియర్లైన శశి థరూర్‌, కె. సురేశ్‌, మనీశ్‌ తివారీ పోటీ పడుతున్నారు. అయితే వీరందరూ అసమ్మతి స్వరాలు వినిపించిన వారే. దీంతో సోనియా ఎవర్ని తెరపైకి తెస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.


మరోవైపు రాజ్యసభలో కూడా నేతల్ని సోనియా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతంగా రాజ్యసభలో నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 2021 తో ముగుస్తోంది. ఈ పదవీ కాలం ముగిసే లోపే మల్లికార్జున ఖర్గేను నియమించనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ పదవికి సీనియర్ నేత, కాంగ్రెస్ పాత కాపు ఆనంద శర్మ పోటీ పడుతున్నారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో సోనియా ఖర్గే వైపే మొగ్గు చూపనున్నారని సీనియర్లు పేర్కొంటున్నారు. 


 2022 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్ళనున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలపై సోనియా దృష్టి సారించనున్నారు. ఉత్తరాఖండ్‌ లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో పంజాబ్‌ ఇన్‌చార్జీగా నియమించారు. ఈశాన్య రాష్ట్రాల్లో రావతే కాంగ్రెస్‌ కు పెద్ద దిక్కు. అయితే రాహుల్‌ గాంధీ మాత్రం ఈ సీనియర్ ను పక్కన పెట్టాలని ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. ఈ సారి మాత్రం అక్కడ సీఎం అభ్యర్థిగా యువతరం నేతల్ని తెరపైకి తేవడానికి అధిష్ఠానం ప్రిపేర్‌ అయిపోయింది.


హిమాచల్‌ పై కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం కన్ను పడింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యవహారాలను మాజీ ఎంపీ, ప్రియాంక కోటరీలో కీలక నేత అయిన రాజీవ్‌ శుక్లా చూస్తున్నారు. ఈ బాధ్యతలను శుక్లాకు అప్పగించినపుడే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో కేంద్ర మంత్రి, యువనేత అనురాగ్‌ ఠాకూర్‌ ను ముందుకు తెచ్చి కాంగ్రెస్‌ ను ఇరికించనుంది. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌... అలర్ట్‌ అయ్యింది. అక్కడ కూడా ఓ యువ నేతను అధిష్ఠానం రంగంలోకి దించనుంది. బీసీసీఐను ఒంటిచేత్తో నడిపిన శుక్లా... హిమచల్‌ లో కూడా రాజకీయ రంగాన్ని వెనకుండి నడిపించగలరని అధిష్ఠానం విశ్వాసం. సీఎం అభ్యర్థిగా యువ నేతను రంగంలోకి దించి... తెర వెనుక శుక్లాతో పావులు కదిపించే యోచనలో సోనియా ఉన్నట్లు తెలుస్తోంది. 


 ఈ అంశాలతో పాటు మీడియా వ్యవహారాలపై కూడా సోనియా దృష్టి సారించారు. ఇప్పటి వరకూ పార్టీ మీడియా విభాగం హెడ్‌ గా రణదీప్‌ సూర్జేవాలా వ్యవహరించారు. ప్రక్షాళనలో భాగంగా ఈ నేతకు భారీ ప్రమోషన్ దొరికింది. ప్రధాన కార్యదర్శి హోదాలో కర్నాటక వ్యవహారాలను అప్పగించింది అధిష్ఠానం. దీంతో ఆయన మీడియా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ పదవికి సచిన్‌ పైలట్‌, పవన్‌ ఖేరా, దివ్య స్పందన పోటీలో ఉన్నారు. ఈ రంగాలతో పాటు కొత్తగా ఏర్పాటైన ''ఏఐసీసీ పరిశోధన విభాగం" పై కూడా సోనియా దృష్టి సారించనున్నారు.


రణజిత్‌ ముఖర్జీ స్థానంలో రాజీవ్‌ గౌడ, గౌరవ్‌ వల్లభ్‌, అమితాబ్‌ దూబే... ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి ఈ గురుతర బాధ్యతను అప్పగించనున్నారు సోనియా. అయితే రాహుల్‌ మాత్రం వీరు ముగ్గురూ కాకుండా  విద్యార్థి విభాగంలో కీలక పాత్ర పోషించిన కృష్ణ అల్లవారును తెరపైకి తేవాలని యోచిస్తున్నారు.  ఇలా అన్ని విభాగాల్లో యువకులతో పాటు విధేయులకు పట్టం కట్టి.. రాహుల్‌ గాంధీకి రాచమార్గాన్ని వేయాలని సోనియా నిర్ణయించుకున్నారు. 


Updated Date - 2020-09-18T00:26:32+05:30 IST