సోనియాకు కాలుష్య సెగ..పణజికి పయనం

ABN , First Publish Date - 2020-11-21T07:22:43+05:30 IST

విశ్రాంతి నిమిత్తం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారంనాడు పణజి చేరుకున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్‌ గాంధీ కూడా ఉన్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉండడంతో

సోనియాకు కాలుష్య సెగ..పణజికి పయనం

పణజి-న్యూఢిల్లీ, నవంబరు 20: విశ్రాంతి నిమిత్తం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారంనాడు పణజి చేరుకున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్‌ గాంధీ కూడా ఉన్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉండడంతో ఆమెకు ఛాతీలో విపరీతమైన సమస్య ఏర్పడింది. ఉబ్బస వ్యాధి ఎక్కువై శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోంది.  కొన్నాళ్లుగా ఆమె ఛాతీసమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వాయుకాలుష్యం వల్ల ఆమె ఇబ్బంది మరింత ఎక్కువైనట్లు గ్రహించిన డాక్టర్లు వెంటనే ఢిల్లీని వీడి ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో కొన్నాళ్లు గడపాలని సూచించారు. దాంతో ఆమె హుటాహుటి పణచి చేరుకున్నారు. దక్షిణ గోవాలోని ఓ రిసార్టులో ఆమె విశ్రాంతి తీసుకుంటారు. ఆరోగ్య సమస్యల వల్ల ఆమె కొన్నాళ్లుగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు.


కీలక రంగాలపై కాంగ్రె్‌సలో 3 కమిటీలు

మూడు కీలక రంగాలు- ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రతలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ రంగాలలో ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను అధ్యయనం చేసి వాటిపై పార్టీ వైఖరి ఎలా ఉండాలన్నది రూపొందించడం ఈ కమిటీల బాధ్యత. గోవా వెళ్లేముందు సోనియా వీటిని నియమించారు. ఈ మూడింటిలోనూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సభ్యులుగా చేశారు. విశేషమేమంటే - అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన, గతంలో లేఖాస్త్రం సంధించిన అసమ్మతివాదుల్లో కీలక నేతలకు కూడా వీటిలో స్థానం కల్పించడం! బిహార్‌ ఎన్నికల్లో పరాజయం అనంతరం సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబ్బల్‌ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, మరికొందరు నేతలు కూడా అసంతృప్తి ధ్వనులు వినిపించడంతో- అసమ్మతి మరింత పెరగకుండా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


ఆర్థిక కమిటీలో పి. చిదంబరం, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ సింగ్‌, జైరామ్‌ రమేశ్‌, విదేశీ వ్యవహారాల కమిటీలో సల్మాన్‌ ఖుర్షీద్‌, శశి థరూర్‌, ఆనంద్‌ శర్మ, సప్తగిరి ఉల్కా, భద్రతా వ్యవహారాల కమిటీలో గులాంనబీ ఆజాద్‌, వీరప్ప మొయిలీ, విన్సెంట్‌ పాలా, వి వైద్యలింగం లను సభ్యులుగా చేర్చారు. పరిశీలించి చూస్తే ఈ కమిటీలు అసమ్మతి- అధిష్టాన విధేయ వర్గాల కలయికగా కనిపిస్తుంది.

Read more