ప్రధాని మోదీకి సోనియా లేఖ.. ఇది లాభాలను దండుకోవడమేనంటూ..
ABN , First Publish Date - 2020-06-16T17:14:57+05:30 IST
పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం సుంకాలు పెంచుకుంటూ పోవడం లాభలు దండుకునే పోకడ అని సోనియా గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం సుంకాలు పెంచుకుంటూ పోవడాన్ని లాభాలు దండుకునే పోకడ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి తాజాగా ఓ లేఖ రాశారు. కరోనా కారణంగా దేశం సామాజిక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. మార్చిలో ఈ సంక్షోభం ప్రారంభైన నాటి నుంచీ కేంద్రం ప్రజలను వెతలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. 2.6 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోసమే ప్రభుత్వం ఈ సుంకాల బాదుడుకు తెరలేపిందంటూ సోనియా లేఖలో మండిపడ్డారు. ప్రజలు ఆర్థిక అభద్రతతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇలా సుంకాలు వడ్డించడం నిర్హేతుకమని వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా చమురు ధరలు 9 శాతం మేర పతనమైనప్పటికీ ప్రభుత్వం ఈ ప్రయోజనాన్ని ప్రజలకు బదలాయించలేదన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు.. ప్రజల ద్వారా లాభాలు దండుకుంనేందుకే ఈ నిర్ణయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నిజంగా స్వావలంబన సాధించాలని ప్రభుత్వం కోరుకుంటే తక్షణం సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేఖలో సోనియా గాంధీ డిమాండ్ చేశారు.