వివాదాస్పద లీకులపై మండిపడ్డ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు

ABN , First Publish Date - 2020-12-15T21:10:06+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇటీవలి

వివాదాస్పద లీకులపై మండిపడ్డ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇటీవలి పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి జీవిత చరిత్రలోని భాగాలంటూ విడుదలైన అంశాలను ‘‘ప్రేరేపిత సంగ్రహాలు’’గా అభివర్ణించారు. తన తండ్రి జీవిత చరిత్ర పుస్తకాన్ని తాను సరి చూసి, లిఖితపూర్వకంగా సమ్మతించే వరకు విడుదల చేయవద్దని ప్రచురణకర్తలను కోరారు. తన సమ్మతి లేకుండా కొన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోటివేటెడ్ సంగ్రహాలు సర్క్యులేట్ అవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 


అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ. ఆయన మంగళవారం ఇచ్చిన ట్వీట్లలో తన తండ్రి జీవిత చరిత్ర పేరుతో కొన్ని మోటివేటెడ్ సంగ్రహాలు ప్రచారమవుతుండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ రచయిత అయిన ప్రణబ్ ముఖర్జీకి తాను కుమారుడినని పేర్కొన్నారు. తన లిఖితపూర్వక సమ్మతి లేకుండా కొన్ని మీడియా ప్లాట్‌ఫాంలలో మోటివేటెడ్ సంగ్రహాలు సర్క్యులేట్ అవుతున్నాయని, వీటిని, ఈ పుస్తకాన్ని ప్రచురించడం తక్షణమే ఆపాలని కోరారు. 


తన తండ్రి స్వర్గస్థులైనందువల్ల ఆయన పుస్తకం ఫైనల్ కాపీని తాను ఆయన కుమారునిగా పూర్తిగా చదవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రి నేడు జీవించి ఉండి ఉంటే ఆయన కూడా ఇదే పని చేసేవారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందు ఫైనల్ కాపీని తాను చదివి, లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేసే వరకు ఈ పుస్తకాన్ని ఆపాలని కోరారు. దీనికి సంబంధించిన సవివరమైన లేఖను తాను పంపించానని, అది త్వరలోనే ప్రచురణకర్తలకు అందుతుందని తెలిపారు. 


ఇటీవల ఈ పుస్తకం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మీడియా ప్రచురించిన ఈ పుస్తకంలోని కొన్ని భాగాలపై వివాదం చెలరేగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ప్రణబ్ ఈ పుస్తకంలో రాసినట్లు ఈ మీడియా కథనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకం 2021 జనవరిలో విడుదలకావలసి ఉంది. 


Updated Date - 2020-12-15T21:10:06+05:30 IST