రేపట్నుంచి మరికొన్ని సడలింపులు.. ఇవన్నీ తెరుచుకుంటాయ్..

ABN , First Publish Date - 2020-05-10T16:32:53+05:30 IST

మూడోవిడత నిషేధాజ్ఞలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ముఖ్యమంత్రి

రేపట్నుంచి మరికొన్ని సడలింపులు.. ఇవన్నీ తెరుచుకుంటాయ్..

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో మూడోవిడత నిషేధాజ్ఞలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మరికొన్ని సడలింపులను ప్రకటించారు. ఈనెల 11న సోమవారం ఉదయం నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల దుకాణాల పనిగంటలను పెంచడంతోపాటు, టీ కొట్లు తెరిచేందుకు అనుమతించారు. ఈ  మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. గ్రేటర్‌ చెన్నై పోలీసు సర్కిల్‌ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పలు రకాల పనులకు నిబంధనలతో అనుమతిని జారీ చేశామని అందులో పేర్కొన్నారు. కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు, హోటళ్లకు నిబంధనలతో తెరిచేందుకు అనుమతిచ్చామని తెలిపారు. మూడో విడత లాక్‌డౌన్‌ ఇక వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెచ్చేందుకు, వారి అవసరాలు తీర్చేందుకు మరికొన్ని సడలింపులు ప్రకటించామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రమంతటా సోమవారం నుంచి ఈ కొత్త సడలింపులు అమల్లోకి వస్తాయని ఎడప్పాడి పేర్కొన్నారు. 


సడలింపులు వీటికే...

- నిత్యావసర వస్తువులైన కూరగాయలు, కిరాణా సరకులు విక్రయించే దుకాణాలు గ్రేటర్‌ చెన్నై పోలీసు సర్కిల్‌లో రోజూ ఉదయం 6నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలి. తక్కిన దుకాణాలు ఉదయం 10.30నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేయాలి.

- కరోనా వైరస్‌ అధికంగా ఉన్న ప్రాంతాలు మినహా చెన్నైతోపాటు రాష్ట్రమంతటా కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు తెరచి ఉంటాయి. తక్కిన దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకూ పనిచేస్తాయి.

- చెన్నై కార్పొరేషన్‌ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ( క్వారంటైన్‌ ప్రాంతాలు మినహా) టీ కొట్లు పార్శిల్‌ సేవలకు మాత్రమే తెరచి 

   ఉంచాలి. అది కూడా ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే పనిచేయాలి. టీ షాపుల వద్ద తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలి. 

   ఎవరూ నిలుచుని, కూర్చుని టీ, కాఫీ సేవించకూడదు. రోజుకు ఐదుసార్లు టీకొట్లలో క్రిమినాశనితో శుభ్రపరచాలి. ఈ నిబంధనను 

   ఉల్లంఘిస్తే వెంటనే షాపులను సీజ్‌ చేస్తారని సీఎం హెచ్చరించారు. 

- గ్రేటర్‌ చెన్నై పోలీసు సర్కిల్‌లో పెట్రోలు బంకులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. 

- చెన్నై నగరం మినహా రాష్ట్రమంతటా పెట్రోలు బంకులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేయాలి. భౌతిక దూరం, కరోనా నిరోధక నిబంధనలు తప్పకుండా పాటించాలి.

-జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న పెట్రోలు బంకులు 24 గంటలూ పనిచేస్తాయి. 

- చెన్నై నగరంలో 33 శాతం ఉద్యోగులతో ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పనిచేయవచ్చు.

- చెన్నై మినహా రాష్ట్రమంతటా ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలి. ఈ సంస్థలు, కార్యాలయాలు ఉదయం10 గంటల నుంచి 7 గంటల వరకూ మాత్రమే పనిచేయడానికి అనుమతి జారీ. ఇక ఈ సడలిం పులన్నీ నిబంధనలకు అనుగుణంగా అమలు చేస్తున్నదీ లేనిదీ కలెక్టర్లు, కార్పొరేషన్‌, మున్సిపల్‌ కమిషనర్లు, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడూ పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి ఆదేశించారు.


కొత్త కేసులు 526

రాష్ట్రంలో శనివారం కొత్తగా 526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో చెన్నైలోనే 279 ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,535కు, చెన్నైలో 3330కు పెరిగింది. మిగిలిన కేసుల్లో అధికంగా చెంగల్పట్టులో 40, పెరంబలూరులో 31, తిరువళ్లూరులో 26, విల్లుపురంలో 67, కాంచీపురంలో 17, అరియలూరులో 16, రాణిపేటలో 10, తిరువణ్ణామలైలో 15, తిరునల్వేలిలో 8 ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మరో 219 మంది డిశ్చార్జి అయ్యారు. వీరిలో చెన్నై ఓమందూర్‌ ఆస్పత్రి నుంచి 23 మంది కోలుకుని ఇంటికెళ్లారు. 


అయితే కరోనా చికిత్సలు ఫలించక శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో నలుగురు మరణించడం గమనార్హం. దీంతో కరోనా మృతుల సంఖ్య 44కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,867కుపైగా కోయంబేడు క్లస్టర్‌ వల్లే నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఆ ప్రకారం రాష్ట్రంలో శనివారం 13,254 నమూనాలను, మొత్తంగా 2,29,670 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 4,248మంది ఐసోలేషన్‌ వార్డులో ఉన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 107 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో చెన్నైకి చెందిన 58 మంది పోలీసులు, 16 మంది అగ్నిమాపక పోలీసులు, తిరువళ్లూరులో 12, కోవైలో 11 మంది ఉన్నారు. అయితే వారిలో దాదాపుగా అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-10T16:32:53+05:30 IST