ఢిల్లీ వేదికగా రోజూ ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పాలని చూస్తున్నారు : మోదీ చురకలు

ABN , First Publish Date - 2020-12-26T19:49:57+05:30 IST

ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి

ఢిల్లీ వేదికగా రోజూ ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పాలని చూస్తున్నారు : మోదీ చురకలు

న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ చురకలంటించారు. ఢిల్లీ వేదికగా ప్రతిరోజూ తనను విమర్శిస్తున్నారని, వారందరూ జమ్మూకశ్మీర్‌ను చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. జమ్మూ కశ్మీర్ ప్రజల నిమిత్తమై ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.... ‘‘ప్రజాస్వామ్యం ఎంత బలీయమైనవో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూపించాయి. ఢిల్లీ వేదికగా రోజూ నన్ను అవమానించాలని, నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారు. వారి కపటత్వం, పవిత్రతను ఓ సారి చూడండి. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా... వారు పాండిచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ప్రకటించగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాం. జమ్మూ కశ్మీర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ఓసారి చూడాలని నేను కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ.’’ అని పరోక్షంగా రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు.


దేశ అభివృద్ధితో భుజం భుజం కలుపుతూ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అత్యంత ప్రశంసనీయమైందని కొనియాడారు. జమ్మూ కశ్మీర్ చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజుగా మోదీ అభివర్ణించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరూ లాభపడతారని పేర్కొన్నారు.  గాంధీ మహాత్ముడి విజన్ అయిన గ్రామ స్వరాజ్యాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు సాధించారని ప్రశంసించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు ఓట్లు వేశారని, అధిక సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారని కొనియాడారు. గతంలో తాము ఇక్కడి ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్నామని, ఆ తర్వాత పొత్తు విచ్ఛిన్నమైపోయిందని మోదీ పరోక్షంగా మెహబూబాతో కొనసాగిన పొత్తు గురించి వ్యాఖ్యానించారు. ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని, తమకు నచ్చిన వారిని ఎన్నుకోవాలన్నదే తమ తాపత్రయంగా ఉండేదని వివరణ ఇచ్చారు.


‘‘మేము గతంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండేవారం. కానీ ఎందుకు బయటకు వచ్చామో తెలుసా? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి, ప్రజలు తమకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకోవాలన్నదే మా తాపత్రయం. ఇక ఇప్పుడు మీకు నచ్చిన ప్రతినిధులు వచ్చారు. మీ కోసం వారు కష్టపడి పనిచేస్తారు. కోవిడ్, చలి తీవ్రత అధికంగా ఉన్నా... ప్రజలు బయటికి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. మహాత్ముడి గ్రామ స్వరాజ్యం అన్న కలను జమ్మూ కశ్మీర్ ప్రజలు సాధించుకున్నారు.’’ అని మోదీ ప్రశంసించారు.  

Updated Date - 2020-12-26T19:49:57+05:30 IST