ఆయుధాల్లేకుండా ఎందుకు పంపారు?

ABN , First Publish Date - 2020-06-19T08:19:30+05:30 IST

మన సైనికులు నిరాయుధులుగా వెళ్లి వీరమరణం పొందారని, అందుకు బాధ్యులెవరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ‘‘నిరాయుధులైన భారత సైనికులను చంపడం ద్వారా చైనా పెద్ద నేరానికి పాల్పడింది...

ఆయుధాల్లేకుండా ఎందుకు పంపారు?

  • సైనికుల మృతికి బాధ్యత ఎవరిది?.. రాహుల్‌ గాంధీ ప్రశ్న
  • సైనికుల వద్ద ఆయుధాలున్నాయి: కేంద్ర మంత్రి జైశంకర్‌ 

న్యూఢిల్లీ, జూన్‌ 18: మన సైనికులు నిరాయుధులుగా వెళ్లి వీరమరణం పొందారని, అందుకు బాధ్యులెవరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ‘‘నిరాయుధులైన భారత సైనికులను చంపడం ద్వారా చైనా పెద్ద నేరానికి పాల్పడింది’’ అని గురువారం వీడియో సందేశంలో పేర్కొన్నారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్పందిస్తూ.. చైనా సరిహద్దులో విధులు నిర్వహించే బలగాల వద్ద ఆయుధాలు ఉంటాయని స్పష్టం చేశారు. ‘‘మనం వాస్తవాలు తెలుసుకుందాం. సరిహద్దు విధుల్లో ఉండే బలగాల వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయి. కానీ, (1996, 2005లో కుదిరిన ఒప్పందం ప్రకారం) సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఇరు వర్గాలూ ఆయుధాలు వాడరు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా విషయంలో బలహీన వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆరోపించారు. ఢిల్లీ- మీరట్‌ సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను చైనా కంపెనీకి కట్టబెట్టిందని విమర్శించారు. మోదీ సర్కారు చైనా ముందు మోకరిల్లిందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

రాహుల్‌.. బాధ్యతారహిత నేత: బీజేపీ 

రాహుల్‌ గాంధీ అత్యంత బాధ్యతారహితమైన రాజకీయ నాయకుడని, ఇది దేశం మొత్తానికి తెలుసని బీజేపీ పేర్కొంది. లద్దాఖ్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో భారత సైనికుల వీరమరణంపై తప్పుడు సమాచారం, అనవసర రాద్ధాంతంతో రాజకీయాలు చేయొద్దని ఆయనకు హితవు పలికింది. రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ తన అవివేకాన్ని బయటపెట్టుకొంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించారు. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘మీ రాజకీయాల కోసం సొంత దేశంపై లేనిపోని, తప్పుడు ప్రచారాలు చేయొద్దు’ అని రాహుల్‌కు హితవు పలికారు. కేంద్రం మూడు ‘సీ’ల.. (కరోనా వైరస్‌, చైనాతో ప్రతిష్టంభన, కాంగ్రె్‌స)పై పోరాడుతోందన్నారు. 

Updated Date - 2020-06-19T08:19:30+05:30 IST