మబ్బుల మాటున గ్రహణం

ABN , First Publish Date - 2020-06-22T08:33:12+05:30 IST

వలయాకార సూర్యగ్రహణం.. ఆకాశంలో అరుదుగా సంభవించే అద్భుతం!! ఆదివారం ఏర్పడిన ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించే అదృష్టం చాలా మంది ప్రజలకు దక్కలేదు. ఆకాశం మబ్బు పట్టివుండటంతో గ్రహణాన్ని వీక్షించలేకపోయారు...

మబ్బుల మాటున గ్రహణం

  • మేఘాలు కమ్ముకోవడంతో కనిపించని అద్భుతం
  • ఖగోళ ప్రియులకు తీవ్ర నిరాశ
  • ఉత్తరాదిన స్వల్పం మిగతా దేశమంతా పాక్షికం
  • గ్రహణం వీడాకా తెరుచుకున్న ఆలయాలు

న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, జూన్‌ 21: వలయాకార సూర్యగ్రహణం.. ఆకాశంలో అరుదుగా సంభవించే అద్భుతం!! ఆదివారం ఏర్పడిన ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించే అదృష్టం చాలా మంది ప్రజలకు దక్కలేదు. ఆకాశం మబ్బు పట్టివుండటంతో గ్రహణాన్ని వీక్షించలేకపోయారు. ఉదయం 10:19 గంటలకు ఏర్పడి న రాహుగ్రస్త సూర్య గ్రహణం మధ్యాహ్నం 2:02 గంట ల దాకా కొనసాగింది. ఉత్తరాదిన రాజస్థాన్‌, హరియా ణ, ఉత్తరాఖండ్‌లోని కురుక్షేత్ర, చమోలి,జోషిమఠ్‌, సిర్సా, సూరత్‌ఘర్‌ ప్రాంతాల్లో స్వల్పంగా.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించింది. ఆ పాక్షిక సూర్యగ్రహణంలో అత్యున్నస్థాయి అయిన 94ు మేర ఢిల్లీలో కనిపించింది. కాంగో, సుడాన్‌, ఇథియోపియా, యెమెన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, పాకిస్థాన్‌, చైనాల్లోనూ గ్రహణం కనిపించింది. దేశంలో పలు ప్రాంతాల్లో ప్రజలు.. ప్రత్యేక కళ్లద్దాలు, ఇతర జాగ్రత్తలు తీసుకొని గ్రహణాన్ని వీక్షించారు.


సూర్యగ్రహణం మళ్లీ ఈ ఏడాది డిసెంబరులో, ఆ తర్వాత 2022లో ఏర్పడనుంది. ఈ రెండూ కూడా భారత్‌లో అంతగా కనిపించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలోనూ ప్రజలు, సూర్యగ్రహణం ఏర్పడిన అద్భుతాన్ని వీక్షించేందుకు ఉత్సాహం కనబర్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్స్‌రేలు, ఫిల్మ్‌లు, నల్ల కళ్లద్దాలు, టెలిస్కోపుల తో గ్రహణాన్ని వీక్షించారు. సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత తెరిచి సంప్రోక్షణ నిర్వహించి.. పూజల అనంతరం భక్తులను అనుమతించారు. యాదాద్రి ఆలయంలో సాయంత్రం 5గంటల నుంచి భక్తులను అనుమతించారు. వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తామని ఆలయాధికారులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని శ్రీ కాళేళ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని   ఆదివారం సాయంత్రందాకా మూసివేశారు. సంప్రోక్షణ, పూజల అనంతరం భక్తులను అనుమతించారు. 

Updated Date - 2020-06-22T08:33:12+05:30 IST