యడియూరప్పపై ఏకంగా 16 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి!

ABN , First Publish Date - 2020-03-13T21:46:55+05:30 IST

కర్నాటకలో కొత్త నాటకం ప్రారంభమైంది. మొన్నటికి మొన్నే రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న కర్నాటక సర్కారు

యడియూరప్పపై ఏకంగా 16 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి!

బెంగళూరు : కర్నాటకలో కొత్త నాటకం ప్రారంభమైంది. మొన్నటికి మొన్నే రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న కర్నాటక సర్కారు.. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాజకీయంగా కొంత శాంతించింది. అయితే తాజాగా మరో కొత్త ట్విస్ట్ ప్రారంభమైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి యడియూరప్పపై ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశం యడియూరప్ప అధ్యక్షత జరిగింది. అయితే ఈ సమావేశంలో కోస్టల్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 16 మంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని సీఎం మొహం మీదే చెప్పేశారు.


యడియూరప్ప వర్కింగ్ స్టైల్ ఏమాత్రం బాగోలేదని, అంతేకాకుండా పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరి పోయిందని వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో సీఎం యడియూరప్ప ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ తమ నియోజకవర్గాలకు అవసరమైన నిధులను తాను విడుదల చేస్తూనే ఉన్నానని, అయినా సరే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలాంటి నిందలు వేయడం ఏమాత్రం బాగోలేదని నిర్మొహమాటంగా అన్నట్లు కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.


ప్రస్తుతానికైతే కోస్టల్ ప్రాంతానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా, పార్టీ వేదికలపైన, సీఎంను వ్యక్తిగతంగా కలిసిన సమయంలో తమ అసహనాన్ని నేరుగా సీఎంతోనే వ్యక్తం చేస్తున్నారు. మిగితా ఎమ్మెల్యేలు కూడా యడియూరప్ప వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యానించడం లేదు. 

Updated Date - 2020-03-13T21:46:55+05:30 IST