ముంబై మురికివాడలో మెరిసిన ఆణిముత్యాలు
ABN , First Publish Date - 2020-12-17T13:33:51+05:30 IST
మహారాష్ట్రలోని ముంబై నగరంలోని మురికివాడలో ఆరుగురు విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపించి మెరిశారు....

ఆరుగురు విద్యార్థులకు నీట్ ర్యాంకులు
ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై నగరంలోని మురికివాడలో ఆరుగురు విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపించి మెరిశారు.మురికివాడకు చెందిన ఆరుగురు విద్యార్థులు నీట్ ర్యాంకులు సాధించి వైద్యవిద్య కోర్సుల్లో చేరారు. ముంబై తూర్పు సబర్బన్ ప్రాంతంలోని గోవాండి మురికివాడకు చెందిన ఆరుగురు విద్యార్థులు మెడికల్ ఎంట్రెన్సు పరీక్షల్లో అర్హత సాధించి ఆదర్శంగా నిలిచారు. నేరాలు, మాదకద్రవ్యాల కేసులతో అపఖ్యాతి పాలైన గోవాండి మురికివాడకు చెందిన జైబాఖాన్ అనే విద్యార్థిని నీట్ క్వాలిఫైయర్ అయ్యారు. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో వైద్యుల కొరతను చూసిన తాను నీటి పరీక్షలో విజయం సాధించాలని నిర్ణయించుకొని, లక్ష్యాన్ని సాధించానని జైబాఖాన్ చెప్పారు. తన తండ్రి డాక్టరుగా పేదల కోసం పనిచేయడం చూసి స్ఫూర్తి పొందానని జైబాఖాన్ చెప్పారు. కేటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ కుమార్ సైఫ్ ఆసిఫ్ జోగ్లే నీట్ పరీక్షల్లో 591 స్కోరు సాధించారు.
పేదల ప్రజలు వైద్యం కోసం పడే కష్టాలు చూసి తాను డాక్టరు కావాలని కోరుకున్నానని సైఫ్ చెప్పారు. తాను డాక్టరు అయ్యాక పేదల కోసం పనిచేస్తానని సైఫ్ చెప్పారు. గోవాండి మురికివాడకు బయటి డాక్టర్లు రారని, కాబట్టి తమ పిల్లలను డాక్టర్లుగా చేయాలని ప్రోత్సహించామని డాక్టర్ జాహిద్ ఖాన్ చెప్పారు. తాము ప్రతి ఏటా ఉన్నత పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించామని ఖాన్ చెప్పారు. వైద్యకళాశాలల్లో ప్రవేశం పొందిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరికి తాము ప్రభుత్వ స్కాలర్ షిప్ లు ఇచ్చామని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు.