ఇంట్లోకి పందులొచ్చాయని రచ్చరచ్చ... ఆరుగురు అరెస్ట్!

ABN , First Publish Date - 2020-07-20T22:34:15+05:30 IST

ఓ వ్యక్తి పెంచుకుంటున్న పందులు మరో ఇంట్లో ప్రవేశించడంతో మొదలైన గొడవ చివరికి ఆరుగురు వ్యక్తుల ...

ఇంట్లోకి పందులొచ్చాయని రచ్చరచ్చ... ఆరుగురు అరెస్ట్!

బహరాయిచ్: ఇంట్లోకి పందులొచ్చాయంటూ మొదలైన గొడవ చివరికి ఆరుగురు వ్యక్తుల అరెస్టుకు దారితీసిన వైనమిది. ఉత్తర ప్రదేశ్‌లోని బహరాయిచ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ‘‘జోగ్నియా గ్రామానికి చెందిన బుద్ధాయ్‌ అనే వ్యక్తి జీవనోపాధి కోసం పందులు పెంచుకుంటున్నాడు. అయితే అవి నిన్న నజ్రుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగ్గా.. కొద్ది సేపటి తర్వాత అంతా సద్దుమణిగింది. అయితే తర్వాత నజ్రుద్దీన్ కుటుంబ సభ్యులు కొందరు బుద్ధాయ్ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు..’’ అని మోతీపూర్ ఎస్‌హెచ్‌వో జేఎన్ శుక్లా పేర్కొన్నారు. తమ ఇంట్లోని మహిళల మీదికి వచ్చి కులం పేరుతో బూతులు దిడుతూ అసభ్యంగా ప్రవర్తించారని బుద్ధాయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘‘వారంతా కలిసి మూకుమ్మడిగా వచ్చి బుద్ధాయ్ కుటుంబ సభ్యులు, మహిళలు, ఇతర బంధువులపై దాడిచేసినట్టు బాధితుడు పేర్కొన్నాడు..’’ అని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. బుద్ధాయ్ ఫిర్యాదు మేరకు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-07-20T22:34:15+05:30 IST