ఏడు వరాలు

ABN , First Publish Date - 2020-05-18T08:19:26+05:30 IST

షరతులు వర్తిస్తాయి కానీ.. రాష్ట్రాలు కోరినట్లు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద రుణ సమీకరణ పరిమితిని పెంచారు! పాఠశాలలు, కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో...

ఏడు వరాలు

  • చివరి ప్యాకేజీలో కేంద్రం ఉద్దీపనలు
  • రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఊరట
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3 నుంచి 5శాతానికి
  • కేంద్ర సంస్కరణలు అమలు చేస్తేనే..
  • ఉపాధి హామీకి మరో 40 వేల కోట్లు
  • 300 కోట్ల అదనపు పని దినాలు
  • డిజిటల్‌ బాట పట్టనున్న విద్య
  • 1-12 తరగతులకు వేర్వేరు చానళ్లు
  • డిజటల్‌ విద్య కోసం పీఎం ఇ- విద్య
  • 30 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు..
  • 100 వర్సిటీలకు నేరుగా అనుమతి
  • బ్లాకు స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాల
  • దివాలా చట్టం నుంచి కంపెనీలకు ఊరట
  • రుణ పరిమితి లక్ష నుంచి కోటికి పెంపు
  • చట్టం నుంచి ఏడాది దాకా మినహాయింపు
  • అన్ని రంగాల పీఎస్‌యూలు ప్రైవేటు బాట
  • చివరి ప్యాకేజీ విడుదల చేసిన నిర్మల


న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): షరతులు వర్తిస్తాయి కానీ.. రాష్ట్రాలు కోరినట్లు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద రుణ సమీకరణ పరిమితిని పెంచారు! పాఠశాలలు, కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విద్యకు పెద్దపీట వేశారు! వైద్య ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు నిధులు కేటాయించారు! ఉపాధి కరువై ఉసూరంటున్న కరోనా కాలంలో ఉపాధి హామీకి మరింత దన్ను ఇచ్చారు! నష్టాలతో దిగాలు పడిన పరిశ్రమలకు ఊరట కల్పించారు! ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పించారు! ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సకు అడ్డంకిగా మారిన కంపెనీల చట్టాల్లోనూ మార్పులు చేశారు! వెరసి, రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చివరి, ఐదో ప్యాకేజీలో ఏడు రంగాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరాలు కురిపించారు.


రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలకు ఊరట ఇచ్చేలా దివాలా చట్టం (ఐబీసీ) సవరణకు ఆర్డినెన్స్‌ జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పెద్దఎత్తున ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. వ్యూహాత్మకం కాని ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించారు.


కరోనా కారణంగా సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధిలేక ఇబ్బందులు పడేవారిని ఆదుకునేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఉపాధి హామీ పథకానికి మరో 40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన 61 వేల కోట్లకు ఇది అదనం. సొంత గ్రామాలకు తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయంతో 300 కోట్ల పని దినాలు పెరుగుతాయని నిర్మల వివరించారు. 


ఒక తరగతి- ఒక చానల్‌

దేశంలో ఆన్‌లైన్‌ విద్యను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి 12 తరగతుల విద్యార్థులకోసం వేర్వేరుగా విద్యా చానళ్లను ప్రారంభింస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించేందుకు ఒక తరగతి- ఒక చానల్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష ప్రసార విధానం ఉన్న స్కూళ్లకు మరో 12 చానళ్లు అందుబాటులోకి వస్తాయని ఆమె చెప్పారు. ఈ చానళ్ల ప్రసారానికి టాటాస్కై వంటి డీటీహెచ్‌ ప్రైవేట్‌ ఆపరేటర్లతో ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కాక, రేడియో, కమ్యూనిటీ రేడియోలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నట్లు నిర్మల చెప్పారు. ‘ఇ- పాఠశాల’లో 200 కొత్త టెక్ట్స్‌ పుస్తకాలను ఉంచుతున్నామని చెప్పారు. ఈ నెల 30నుంచి ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించేందుకు టాప్‌ 10 యూనివర్సిటీలకు నేరుగా అనుమతినిచ్చినట్లు చెప్పారు. వేర్వేరు మార్గాల ద్వారా డిజిటల్‌ విద్యను అందించేందుకు పీఎం - ఇవిద్య అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతు కోసం మనోదర్పణ్‌ అనే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. 


జిల్లాకో అంటువ్యాధుల ఆస్పత్రి

జిల్లాల్లో అంటువ్యాధుల నివారణకు ఆసుపత్రులు, జిల్లాల్లోనూ, బ్లాకు స్థాయిలోనూ సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు నెలకొల్పనున్నట్లు  ఆర్థికమంత్రి ప్రకటించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక స్థాయి ఆరోగ్య సంస్థలను ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో పరిశోధనకు ప్రోత్సాహం కల్పించడం, జాతీయ డిజిటల్‌ ఆరోగ్యమిషన్‌ ఆధ్వర్యంలో బ్లూప్రింట్‌ను అమలు చేశామన్నారు.  


రాష్ర్టాలకు రూ.46,038 కోట్లు

ఏప్రిల్‌లో రాష్ర్టాలకు పన్ను వాటా కింద రూ.46,038 కోట్లు ఇచ్చామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రూ.12,390 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్స్‌ను ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ర్టాలకు సరైన సమయంలో అందించినట్టు చెప్పారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద ఏప్రిల్‌ మొదటి వారంలో రూ.11,092 కోట్లు విడుదల చేశామన్నారు. కరోనాను ఎదుర్కొనే కార్యకలాపాలకు రూ.4,113 కోట్లు విడుదల చేసినట్టు ఆ మె తెలిపారు. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో ఆర్‌బీఐ మార్చి నుంచి ప్రకటించిన రూ.8 లక్షల కోట్ల లిక్విడిటీ చర్యలు కూడా కలిసి ఉన్నట్టు తెలిపారు. గత రెండు నెలల్లో 12 లక్షల మంది ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఖాతాదారులు రూ.3,360 కోట్లు ఉపసంహరించుకున్నట్టు మంత్రి వెల్లడించారు. 


రాష్ర్టాల రుణ సమీకరణ పరిమితి పెంపు

ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ర్టాల కోరిక నెరవేరింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ర్టాలు రుణాలను సమీకరించుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ కేంద్రం అనుమతిచ్చింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో ఇప్పటిదాకా 3 శాతంగా ఉన్న రుణ సమీకరణ పరిమితి 5 శాతానికి పెరిగింది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. రుణ  సమీకరణ పరిమితి పెంపుతో రాష్ర్టాలకు రూ.4.28 లక్షల కోట్ల నిధులు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. కాగా రుణ సమీకరణ పరిమితిని రాష్ర్టాలు అమలు చేయాల్సిన నిర్దేశిత సంస్కరణలతో అనుసంధానం చేశారు. ఈమేరకు రాష్ర్టాలు వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు, సులభతర వ్యాపార నిర్వహణ, విద్యుత్‌ సబ్సిడీలు నేరుగా అందించడం, పట్టణ స్థానిక సంస్థల రాబడులకు సంబంధించిన విషయాల్లో సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం జీఎ్‌సడీపీలో 3 శాతం ఆధారంగా రాష్ర్టాలు నికరంగా రుణాన్ని సమీకరించే పరిమితి రూ.6.41 లక్షల కోట్లుగా ఉందని, కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి వీలుగా రుణ సమీకరణ పరిమితిని పెంచాలని కోరుతూ కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు ఆమె చెప్పారు.


  ‘‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ర్టాల డిమాండ్‌కు అంగీకరించి రుణ సమీకరణ పరిమితిని 5 శాతానికి పెంచాం. దీని వల్ల రాష్ర్టాలకు అదనంగా రూ.4.28 లక్షల కోట్లు సమకూరుతాయి’’ అని ఆమె అన్నారు. ఏవిధంగా రాష్ట్రాలను  రుణ సమీకరణకు అనుమతిస్తారో కూడా ఆమె వివరించారు. రాష్ర్టాల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3-3.5 శాతంగా ఉంది. దీన్ని 0.5 శాతం పెంచుకోవడానికి ఎలాంటి షరతులు ఉండవు. తదుపరి 1 శాతం అంటే 4.5 శాతం వరకు... నాలుగు విడతల్లో 0.25 శాతం చొప్పున పెంచుతారు. ప్రతి విడతను కూడా ప్రత్యేక కొలమానంగా ఉన్న, ఆచరణీయ సంస్కరణతో అనుసంధానమై ఉంటుంది. 4 సంస్కరణలకు సంబంధించిన షరతుల్లో కనీసం 3 మైలురాళ్లను సాధిస్తే మిగిలిన 0.5 శాతం రుణ సమీకరణ సదుపాయాన్ని కల్పిస్తారు. రాష్ర్టాలకున్న 3 శాతం రుణ సమీకరణ పరిమితిలో 75 శాతం సమీకరణకు ఇప్పటికే అనుమతిచ్చామని నిర్మల చెప్పారు. 


రాష్ర్టాల ఖజానాలపై తీవ్ర ఒత్తిడి

కరోనా సంక్షోభానికన్నా ముందు నుంచే రాష్ర్టాల ఖజానాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారితో వాటి రాబడులపై గట్టి దెబ్బపడింది. ఇది సర్వత్రా ఆందోళనలకు దారితీస్తోంది. ప్రస్తుతం రాష్ర్టాలు ప్రజల ఆరోగ్యం, సామాజిక సంక్షేమ వ్యయాల కోసం రాబడులను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని తాజాగా ఓ సంస్థ వెలువరించిన వర్కింగ్‌ పేపర్‌ స్పష్టం చేసింది. రాష్ర్టాల రాబడులపై ఒత్తిడికి అనేక కారణాలున్నాయని, కేంద్రం నుంచి రాష్ర్టాలకు వచ్చే నిధుల బదిలీకి సంబంధించిన ఆర్థిక స్వరూపంలో చోటు చేసుకున్న మార్పులు తదితరాలు కూడా వీటిలో ఉన్నాయని పేర్కొంది.


కరోనా మూలంగా రాబడుల ఆర్జనలో మందగమనం నెలకొందని తెలిపింది. రానున్న నెలల్లో కరోనా విషయంలో రాష్ర్టాల బాధ్యత పెరుగుతుందని పేర్కొంది. రాష్ర్టాల రాబడుల్లో పన్నులు కీలక వనరుగా ఉన్నట్టు తెలిపింది. రాష్ర్టాల రాబడుల్లో వీటి వాటా 2018-19లో దాదాపు 30 శాతం ఉండగా.. 2019-20 లో సవరించిన అంచనాల ప్రకారం 24 శాతానికి తగ్గిపోయింది. కరోనా మూలంగా రాష్ర్టాల పరోక్ష పన్నుల వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కాగా తమ రాబడులను పెంచుకోవడానికి పలు రాష్ర్టాలు ఆల్కహాల్‌పై అదనంగా పన్నులు విధించాయి. అదనంగా రుణాలు తీసుకున్నాయి. ఉద్యోగుల వేతనాలు తగ్గించాయి. అత్యవసరంకాని మూలధన వ్యయాల్లో కోత విధించాయి.


Updated Date - 2020-05-18T08:19:26+05:30 IST