సీఎం సీటు కోసం కన్నడిగులను వంచించొద్దు: సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2020-09-18T22:52:34+05:30 IST

కోవిడ్‌ పరిస్థితిని చక్కదిద్దలేకపోయారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై ప్రతిపక్ష..

సీఎం సీటు కోసం కన్నడిగులను వంచించొద్దు: సిద్ధరామయ్య

బెంగళూరు: కోవిడ్‌ పరిస్థితిని సరిగా చక్కదిద్దలేకపోయారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. కన్నడిగుల గోడను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ శుక్రవారంనాడు వరుస ట్వీట్లలో ఆయన విమర్శించారు.


'ప్రధాని అపాయింట్‌మెంట్ దొరక్క పలుమార్లు నిరుత్సాహానికి గురైన ముఖ్యమంత్రికి ఎట్టకేలకు పీఎం అపాయిమెంట్ దొరికింది. మీ కుర్చీ కాపాడుకునే ప్రయత్నాలకు తోడు, కన్నడిగుల సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకురండి' అని సిద్ధరామయ్య ఓ ట్వీట్‌లో సీఎంకు సూచించారు. న్యాయంగా రావాల్సిన వరదసాయాన్ని డిమాండ్ చేయాలని అన్నారు.


'సీఎం గారూ... మీరు గత ఏడాది వరద సాయంగా రూ.35,000 కోట్లు అడిగారు. అయితే కర్ణాటకకు వచ్చింది కేవల రూ.1.869 కోట్లే. ఈ ఏడాది కూడా వరదలు వచ్చాయి. మీరు వేసిన అంచనా ప్రకారం వరద నష్టం రూ.8,000 కోట్లుగా ఉంది. మీ వాదనను కేంద్రం ముందు సమర్ధవంతంగా వినిపించి, మన హక్కుగా రావాల్సిన వరద సాయాన్ని రాబట్టండి. మీ పార్టీ నాయకత్వం బెదరింపులకు లొంగొద్దు. పూర్తి నిధులు రాబట్టేందుకు బాధ్యత తీసుకోండి' అని సిద్ధరామయ్య సూచించారు. జీఎస్‌టీ పరిహారం అనేది కూడా ఆందోళనకరంగా, కోఆపరేటివ్ ఫెడరలిజంపై ప్రభావం చూపేలా ఉందని ఆయన అన్నారు. జీఎస్‌టీ పరిహారంగా కర్ణాటక రూ.25,508 కోట్లు రాబట్టాలని, ఈ విషయంలో నాయకత్వ బెదరింపులకు లొంగవద్దని, ప్రజావంచనకు పాల్పడవద్దని సీఎంను కోరారు.


కోవిడ్-19 పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి మరిన్ని వెంటిలేటర్లు డిమాండ్ చేయాలని కూడా యడియూర్పప్పకు సిద్ధరామయ్య సూచించారు. ఇప్పటికీ కేంద్ర నుంచి రాష్ట్రానికి తగినన్ని వెంటిలేటర్లు రాలేదని, తక్షణం వాటిని రాబట్టాలని అన్నారు. ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల కోవిడ్ ప్యాకేజీలో ఎంత మొత్తం కర్ణాటకకు వచ్చిందో సీఎం చెప్పాలని అన్నారు. నిరుద్యోగ, పేద కుటుంబాలకు నెలవారీ రూ.6,000 ఆర్థిక సాయం అందించే ఎన్‌వైఏవై పథకాన్ని అమలు చేయాలని కూడా సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-18T22:52:34+05:30 IST