సుదర్శన్‌ టీవీకి షోకాజ్‌ నోటీసు

ABN , First Publish Date - 2020-09-24T07:31:13+05:30 IST

వివాదాస్పద కార్యక్రమం ‘యూపీఎస్సీ జిహాద్‌’ అంశంలో సుదర్శన్‌ న్యూస్‌ చానల్‌ నిబంధనలు ఉల్లంఘించిందని, ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా వారికి షోకాజ్‌ నోటీసు జారీ చేశామని కేంద్రం.. సుప్రీంకోర్టుకు విన్నవించింది.

సుదర్శన్‌ టీవీకి షోకాజ్‌ నోటీసు

‘యూపీఎస్సీ జిహాద్‌’పై సుప్రీంకోర్టులో కేంద్ర అఫిడవిట్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: వివాదాస్పద కార్యక్రమం ‘యూపీఎస్సీ జిహాద్‌’ అంశంలో సుదర్శన్‌ న్యూస్‌ చానల్‌ నిబంధనలు ఉల్లంఘించిందని, ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా వారికి షోకాజ్‌ నోటీసు జారీ చేశామని కేంద్రం.. సుప్రీంకోర్టుకు విన్నవించింది. బుధవారం ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను అనుసరించి 1995లో రూపొందించిన కేబుల్‌ టీవీ నిబంధనల ప్రకారం.. మతాలు, సంఘాలపై దాడి, వాటికి సంబంధించిన దృశ్యాలు, మత వైఖరులను కించపరిచే లేదా ప్రోత్సహించే ఎలాంటి కార్యక్రమాలనూ ప్రసారం చేయకూడదని, సుదర్శన్‌ టీవీ.. ఈ నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంది. జస్టిస్‌ చంద్రచుడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి ప్రభు త్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. షోకాజ్‌ నోటీసుపై స్పందనకు సుదర్శన్‌ టీవీకి ఈ నెల 28 వరకు గడువు విధించినట్లు తెలిపారు. ఈ అంశంపై విచారణ జరిపి సుదర్శన్‌ టీవీపై చట్టప్రకారం తీసుకునే చర్యలపై నివేదికను సమర్పించాలని కోర్టు  కేంద్రాన్ని ఆదేశించింది. షోకాజ్‌ నోటీసుపై సుదర్శన్‌ టీవీ స్పందనను పరిశీలించిన తర్వాత కోర్టుకు నివేదిక సమర్పిస్తామని కేంద్రం తెలిపింది. దీంతో.. తదుపరి విచారణను అక్టోబరు 5కి వాయిదా వేసిన కోర్టు.. కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వు అప్పటివరకు కొనసాగుతుందని పేర్కొంది.

Updated Date - 2020-09-24T07:31:13+05:30 IST