టైర్ల దుకాణంపై దుండగుల కాల్పులు.. కాసేపటికి గ్యాంగ్‌స్టర్ నుంచి ఫోన్!
ABN , First Publish Date - 2020-12-30T22:34:15+05:30 IST
ఉత్తరాఖండ్‌లో ఇవాళ ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ టైర్ల దుకాణంపై కాల్పులు జరపగా..

రుద్రాపూర్: ఉత్తరాఖండ్‌లో ఇవాళ ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ టైర్ల దుకాణంపై కాల్పులు జరపగా.. అది జరిగిన కొద్దిసేపటికే కోటి రూపాయలు ఇవ్వాలంటూ షాపు యజమానికి ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి ఫోన్ కాల్ రావడంపై కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఓ మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు షాపు మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ‘‘కాల్పులు జరిగిన కొద్దిసేపటికే ఆ షాపు యజమానికి ఫోన్ కాల్ వచ్చింది. జైలు నుంచి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని మాట్లాడుతున్నాననీ.. తనకు వెంటనే కోటి రూపాయలు పంపాలంటూ అవతలి వ్యక్తి డిమాండ్ చేశాడు..’’ అని ఎస్ఎస్‌పీ కున్వార్ వెల్లడించారు. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ బెదిరించిన కేసులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దీంతో నిజంగా బిష్ణోయ్ నుంచే ఫోన్‌కాల్ వచ్చిందా లేక ఆయన పేరుతో మరో గ్యాంగ్ ఈ పనికి పాల్పడిందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ కోసం విడివిడిగా మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఎస్‌పీ వెల్లడించారు.