రాణి పద్మావతి, రాణా ప్రతాప్‌ పురస్కారాల ఏర్పాటు : శివరాజ్ సింగ్ చౌహాన్

ABN , First Publish Date - 2020-10-28T00:43:43+05:30 IST

మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్, రాణీ పద్మావతి స్మారక

రాణి పద్మావతి, రాణా ప్రతాప్‌ పురస్కారాల ఏర్పాటు : శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్ : మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్, రాణీ పద్మావతి స్మారక పురస్కారాలను ఏర్పాటు చేస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. మహారాణా శౌర్య పురస్కార్, పద్మిని పురస్కార్ పేరుతో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. రాణీ పద్మావతి ధైర్యసాహసాలను వివరించే పాఠాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో చేర్చుతామని తెలిపారు. రాణి పద్మావతి స్మారక కేంద్రాన్ని నిర్మించేందుకు మనువభన్ టేక్రిలో భూమిని కేటాయించినట్లు తెలిపారు. 


మధ్య ప్రదేశ్‌లో 28 శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాయి. దాదాపు 10 రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొంది. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి దుర్గావతి, దేవి అహల్యాబాయి, అవంతిబాయి లోఢీ స్మారక పురస్కారాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 


ఇదిలావుండగా, మధ్య ప్రదేశ్‌లో 28 శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబరు 3న జరుగుతాయి, నవంబరు 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2020-10-28T00:43:43+05:30 IST