ఎన్నికలా? మళ్లీ ప్రమాణమా?.. శివసేన వ్యూహమేంటి?

ABN , First Publish Date - 2020-04-25T21:32:21+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తలమునకలై ఉంటే, మరోవైపు ఆయన తలపై 'గవర్నర్' నిర్ణయమనే కత్తి ..

ఎన్నికలా? మళ్లీ ప్రమాణమా?.. శివసేన వ్యూహమేంటి?

ముంబై: మహారాష్ట్రలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తలమునకలై ఉంటే, మరోవైపు ఆయన తలపై 'గవర్నర్' నిర్ణయమనే కత్తి వేలాడుతోంది. విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒక స్థానానికి ఉద్ధవ్‌ను నామినేట్ చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసి పక్షం రోజులైంది. అయినప్పటికీ గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సంక్షోభం ముంచుకొస్తోందా అనే సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే కొనసాగాలంటే మే 28కి ముందే, అంటే ఆరు నెలల కాల పరిమితి ముగియక ముందే ఆయన విధాన పరిషత్‌కు నామినేట్ కావాల్సి ఉంటుంది. శివసేన కంటూ సొంత ప్లాన్స్ ఉన్నాయని, అయితే గవర్నర్ త్వరలోనే థాకరేను శాసన మండలికి నామినేట్ చేస్తారనే నమ్మకం తమకుందని శివసేన వర్గాలు చెబుతున్నాయి.


ఈనెల 9న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై, ఉద్ధవ్‌ను శాసన మండలి సభ్యుడిగా నామినేట్ చేసేందుకు గవర్నర్‌కు సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దర్ని గవర్నర్ నామినేట్ చేయాల్సి ఉంది. కేబినెట్ నిర్ణయాన్ని అధికారికంగా గవర్నర్‌కు పంపారు. గవర్నర్ అంగీకారం లాంచనమే అయినప్పటికీ పదిహేను రోజులుగా రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీనిపై రాజ్‌భవన్ వర్గాలు సైతం పెదవి విప్పడం లేదు.


తాజా పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. 'రాజ్‌భవన్ రాజకీయ కుట్రలకు వేదిక కారాదు. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని చరిత్ర విడిచిపెట్టదనే విషయం గుర్తుంచుకోవాలి. గవర్నర్ రామ్‌లాల్ (ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్) వ్యవహారమే ఇందుకు ఉదాహరణ' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఉభయ సభల్లో ఏదో సభ నుంచి ఎన్నిక కావడానికి ఉద్ధవ్ థాకరేకు ఉన్న గడవు మరో నెలలో ముగియబోతోంది. దీంతో సహజంగానే అధికార పార్టీ శిబిరంలో ఉత్సుకత పెరుగుతోంది.


సేన వ్యూహం ఏమిటి?

లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత శివసేన ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న కౌన్సిల్ సీట్లకు ఎన్నికలు జరపాలని నిర్ణయించవచ్చు. నిజానికి ఈనెలలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదించి, ఎన్నికలు ప్రకటించాల్సి వస్తుంది. రెండో ఆప్షన్ కూడా ఉంది. కరోనా అసాధారణ పరిస్థితుల్లో లెజిస్లేచర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, అదే సమావేశంలో శాసన మండలి సభ్యులంతా ఉద్ధవ్‌ను మండలికి నామినేట్ చేయవచ్చు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించకుంటే కోర్టుకు వెళ్తామని శివసేన వర్గాలు చెబుతున్నాయి. మరో మార్గం కూడా ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మే 28కి ముందు ఉద్ధవ్ రాజీనామా చేసి, ఒకటి రెండు రోజుల్లోనే మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారు. దాంతో ఆయనకు మరో ఆరు నెలలు సమయం దొరకుతుంది.


నిపుణులేమంటున్నారు?

'పార్లమెంటరీ వ్యవస్థలో కేబినెట్ సిఫారసును గవర్నర్ పాటించడం లాంఛనం. మరో నెల వ్యవధి ఉన్నందున కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదిస్తారనే అనుకుంటున్నాం' అని విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సుభఆష్ పాల్సీకర్ తెలిపారు. కేబినెట్ మాటను గవర్నర్‌ ఖాతరు చేయకుంటే రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశాలుంటాయని, ఉద్ధవ్ రాజీనామా చేసి, మరొకరికి బాధ్యతలు అప్పగించవచ్చని, ఆయన చేత రాజీనామా చేయించి మళ్లీ తిరిగి పగ్గాలు చేపట్టవచ్చని మరో విద్యావేత్త అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా విజృంభిస్తున్న వేళ మహారాష్ట్రలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభానికి తావుండకపోవచ్చనే ఆశాభావమే ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-04-25T21:32:21+05:30 IST