ముస్లింలీగ్ భాషలో మాట్లాడుతున్న శివసేన: బీజేపీ

ABN , First Publish Date - 2020-12-27T22:58:55+05:30 IST

కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దిగజారాయంటూ 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో ..

ముస్లింలీగ్ భాషలో మాట్లాడుతున్న శివసేన: బీజేపీ

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దిగజారాయంటూ 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో రాయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. శివసేనపై మండిపడింది. ముస్లిం లీగ్ తరహాలో శివసేన మాట్లాడుతోందని బీజేపీ ప్రతినిధి షానవాస్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీతో వాళ్లు (శివసేన) జట్టు కట్టడంతో కాంగ్రెస్, 'టుకడే టుకడే గ్యాంగ్' సిద్ధాంతాల ప్రభావం వారిపై పడినట్టు కనిపిస్తోందన్నారు. శివసేన కనీసం మహారాష్ట్రను కూడా నడిపించలేదని అనిపిస్తోందని, ఆ తరహా బాషను వాడుతోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హుస్సేన్ అన్నారు.


కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణించాయని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా'  సంపాదకీయం పేర్కొంది. 'మన దేశంలోని రాష్ట్రాలు సోవియట్ యూనియన్‌ తరహాలో విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం పట్టదు' అని వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు తాము హాని చేస్తున్నామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించకుంటే సోవియట్ యూనియన్ విచ్ఛినమైన రీతిలో దేశంతో రాష్ట్రాలు తెగతెంపులు చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదని ఘాటుగా విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ సామర్థ్యం, విశ్వసనీయత 2020 సంవత్సరంలో ప్రశ్నార్ధకమైందని 'సామ్నా' సంపాదకీయం పేర్కొంది.

Updated Date - 2020-12-27T22:58:55+05:30 IST